తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ పార్టీలో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ తీవ్ర ప్ర‌కంప‌నలు రేపుతోంది. మంత్రివర్గంలో ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో కేసీఆర్ కొందరికి మంత్రి పదవులు కేటాయించారు. తాజా విస్తరణలో మొత్తం ఆరుగురికి మంత్రి పదవులు దక్కాయి. ఈ క్రమంలోనే మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న సీనియర్ నేతలు... ఇతరులు ఇప్పుడు తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముందుగా మాజీ హోం మంత్రి నాయిని న‌ర్సింహారెడ్డి కేసీఆర్ త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని చెప్పి మాట త‌ప్పార‌ని ఫైర్ అవ్వ‌గా.. కేబినెట్లో మాదిగ‌ల‌కు చోటు లేక‌పోవ‌డంపై మాజీ ఉప ముఖ్య‌మంత్రి తాటికొండ రాజ‌య్య అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.


ఇక ఆదిలాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జోగు రామ‌న్న రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో  అజ్ఞాతంలోకి వెళ్లారని ప్రచారం జరుగుతోంది. మున్నూరు కాపు సామాజిక‌వ‌ర్గానికి చెందిన ఆయ‌న గ‌త ట‌ర్మ్‌లో కేసీఆర్ కేబినెట్‌లో మంత్రిగా ఉన్నారు. ఈ సారి కూడా అదే సామాజిక‌వ‌ర్గం కోటాలో మ‌ళ్లీ త‌న‌కు మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని భావించారు. అయితే కేసీఆర్ జోగుకు షాక్ ఇస్తూ అదే వ‌ర్గం నుంచి క‌రీంన‌గ‌ర్ ఎమ్మెల్యేగా ఉన్న గంగుల క‌మ‌లాక‌ర్‌కు కీల‌క‌మైన బీసీ మంత్రిత్వ శాఖ‌ను కేటాయించారు. 


సీనియ‌ర్‌గా ఉన్న త‌న‌కు మంత్రి ప‌ద‌వి రాక‌పోవ‌డంతో రామ‌న్న అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. త‌న గ‌న్‌మెన్ల‌ను వ‌దిలేసి మరీ ఆయ‌న వెళ్లిపోయారు. సోమవారం ఉదయం నుంచి రామన్న ఫోన్ స్విచ్చాఫ్ అయింది. మ‌రోవైపు ఆయ‌న ఇంటి ద‌గ్గ‌ర ప‌రిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మార‌డంతో పోలీసులు, కుటుంబ స‌భ్యులు ఆయ‌న కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. రామ‌న్న గ‌తంలో  బీసీ సంక్షేమం, అట‌వీ శాఖ చూశారు.


ఉమ్మ‌డి కరీంన‌గ‌ర్ జిల్లాలో ఏకంగా న‌లుగురికి మంత్రి ప‌ద‌వులు ఇవ్వ‌డంపై కూడా రామ‌న్న అనుచ‌రులు మండిప‌డుతున్నారు. ఇక రామ‌న్న‌తో పాటు మాజీ మంత్రులు నాయిని నరసింహా రెడ్డి, లక్ష్మారెడ్డి, జోగు రామన్న, మాజీ డిప్యూటీ స్పీకర్‌‌‌‌ పద్మా దేవేందర్‌‌‌‌రెడ్డి, ఎమ్మెల్యేలు రేఖానాయక్‌‌‌‌, రెడ్యానాయక్‌‌‌‌, ఆరూరి రమేశ్‌‌‌‌‌తో పాటు పలువురు నేతలు మంత్రి పదవులు ఆశించి భంగ‌ప‌డ్డారు.


మరింత సమాచారం తెలుసుకోండి: