దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 1 నుంచి  అమల్లోకి వచ్చిన ట్రాఫిక్ రూల్స్.. వాహనదారులకు టెర్రర్ పుట్టిస్తున్నాయి. ఒక్క బెంగళూరులోనే వారం రోజుల్లో 72 లక్షల రూపాయల ఫైన్ వసూలు చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేయకపోతే.. ఫైన్ కట్టాల్సిన పనిలేదని కేంద్ర మంత్రి గడ్కరీ చెబుతున్నారు. అధిక ఫైన్లు లేకపోతే.. ఎవరు భయపడతారని ఆయన ప్రశ్నిస్తున్నారు. 


దేశంలో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఏటా రోడ్డు ప్రమాదాల కారణంగా రెండు శాతం జీడీపీని దేశం కోల్పోతోంది. ఇప్పటివరకు ట్రాఫిక్ రూల్స్ ఉన్నా.. వాటిని వాహనదారులు ఎవరూ పట్టించుకోవడం లేదు. యథేచ్ఛగా ఉల్లంఘనలు చేసేసి.. చిన్నపాటి ఫైన్లు కట్టేసి బయటపడుతున్నారు. అయితే ఇలా అయితే పరిస్థితిలో ఎప్పటికీ మార్పు రాదని భావించిన కేంద్రం.. భారీగా ఫైన్లు పెంచుతూ.. మోటారు వాహన చట్టానికి సవరణ చేసింది. సెప్టెంబర్ ఒకటి నుంచి అది దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. 


బెంగళూరులో మాత్రం రెండు రోజులు ఆలస్యంగా చట్టం అమలైంది. సెప్టెంబర్ 3 నుంచి ఇప్పటివరకు ఒక్క బెంగళూరు సిటీలోనే 72 లక్షలకు పైగా ట్రాఫిక్ ఫైన్ లు వసూలయ్యాయి. ట్రాఫిక్ పోలీసులకు దొరికిన కేసుల్లో లైసెన్స్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుండా బండి నడపడం, హెల్మెట్, సీట్ బెల్ట్ లేని డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ లాంటివి ఉన్నాయి. అయితే భారీ ట్రాఫిక్ చలాన్లపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇలా అయితేనే వాహనదారులు భయపడతారని ప్రజారవాణా వినియోగించేవారు, పాదచారులు అభిప్రాయపడుతున్నారు. కానీ కొంతమంది వాహనదారులు మాత్రం ఇది సామాన్యుడికి భారమే అంటున్నారు. పొరపాటున పత్రాలు పోయినా కూడా.. ట్రాఫిక్ పోలీసులు వినిపించుకోవడం లేదని, ఫైన్ వేసేస్తున్నారని వాపోతున్నారు. ఫైన్లు తగ్గించాలన్న డిమాండ్ ను తోసిపుచ్చారు కేంద్ర మంత్రి గడ్కరీ. రూల్స్ ఫాలో అయితే.. ఎవరూ ఫైన్ కట్టాల్సిన పనిలేదని తేల్చేశారు గడ్కరీ. భారీ ఫైన్లు ఉంటేనే.. కొంతకాలానికి మన దేశంలో ట్రాఫిక్ కూడా క్రమబద్ధంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. కేంద్ర మంత్రి గడ్కరీ అభిప్రాయాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా సమర్థించారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే ఫైన్లు విధించాల్సిందేనన్నారు. జరిమానాల్ని కూడా తప్పుబడితే ఎలాగని ప్రశ్నించారు కేటీఆర్. అయితే అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లు, పనిచేయని ట్రాఫిక్ సిగ్నల్స్ ను ఎవరు సరిచేస్తారని.. వాహనదారులు కేంద్రాన్ని నిలదీస్తున్నారు. కేవలం భారీ ఫైన్లతోనే సమస్య పరిష్కారం కాదని గుర్తుచేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: