తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ జిల్లా కంచుకోటలా ఉండేది. పసుపు రంగు కనిపిస్తే జనం పులకించిపోయేవారు, సైకిల్ తోడుగా ఉంటే గమ్యం క్షేమంగా చేరుకుంటామనే భరోసా ఉండేది, అంత ప్రభంజనం కలిగిన ఆ పార్టీ గత వైభవాన్ని ఒక్క సారిగా కూలిపోయింది, కోలుకోలేని దెబ్బతో కొట్టుమిట్టాడుతోంది. ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమసమూహములు అన్న ప్రశ్న ఇప్పుడు విజయనగరం జిల్లా టిడిపికి వర్తించే పరిస్థితి ఏర్పడింది. తెలుగుదేశాన్ని ఎన్టీఆర్ స్థాపించిన మొదలు, మొన్నటి ఎన్నికల ముందు వరకు విజయనగరం జిల్లాలో పార్టీకి తిరుగుండేది కాదు. ఏ ఎన్నికలైనా ఆ పార్టీదే హవా, అన్ని నియోజక వర్గాల్లోనూ పసుపు జెండాల రెపరెపలే కనిపించేవి. నాయకులు ఎన్ని జండాలు మార్చినా కార్యకర్తలు మాత్రం ఒకే గుండె మాదిరిగా కలిసుండేవారు. తెలుగుదేశం పార్టీ అంటే జనానికి ఎనలేని నమ్మకం ఆ పార్టీ అధినేత పట్ల అచంచలమైన విశ్వాసం, అంత ప్రాభవం ఉన్న పార్టీ ఇప్పుడు కష్టాల కొలిమిలో కరుగుతుంది.


దీనికి ప్రధాన కారణం విజయనగరం జిల్లాలో తలెత్తిన నాయకత్వ లోపమే అని విశ్లేషకులు అభిప్రాయం. మొదట్నుంచీ విజయనగరం జిల్లాలో టీడీపీ అంటే పూసపాటి అశోక్ గజపతి రాజు అన్న ముద్ర పడిపోయింది. ఆ పార్టీలో ఆయన చెప్పిందే వేదంగా భాసిల్లింది. అయితే ఇప్పుడా పరిస్థితి కనుమరుగైంది, అడుగడుగునా నాయకత్వ లేమి స్పష్టంగా కనిపిస్తోంది. పార్టీపరంగా వ్యూహ రచన కూడా కొరవడింది, మొన్నటి ఎన్నికల్లో ప్రధానంగా ఈ అంశాలే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చాయని చెప్పాలి. జనంలో కలిసిపోయి దూకుడుగా వ్యవహరించే ఒక్కరంటే ఒక్క నాయకుడు కూడా లేకపోవటం టిడిపికి మైనస్ గా మారింది. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాన్ని టార్గెట్ చేయడంలో గానీ ఇప్పుడు ప్రతిపక్ష స్థానాల్లో ఉండి అధికార పక్షం తప్పిదాలను ఎండగట్టడం లేదని జిల్లా టిడిపి నేతలు విఫలమవుతున్నారు.


టిడిపి సీనియర్ నేతగా ఉన్న అశోకగజపతిరాజు అవినీతికి ఆమడ దూరంలో ఉంటారన్న ఒకే ఒక్క మాటతో ఇంత కాలం నెట్టుకొచ్చారు కానీ, ఆయన నమ్మిన బంటులా వ్యవహరించే ఒకరిద్దరు వ్యక్తులు ఈ జిల్లాలోనే కాదు పక్క జిల్లాల్లో కూడా కాంట్రాక్టుల పేరుతో నోళ్లేశారట. ప్రభుత్వంలో అశోక్ గజపతి రాజు హవాని ఆసరా చేసుకొని వారు చెలరేగిపోయారట. అప్పట్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా ఉన్న కాంట్రాక్టర్ లను దూరం పెట్టి ఉద్దేశ పూర్వకంగా ఈ దందా నడిపించారని ఇదంతా అశోక్ గజపతి రాజుకు తెలిసే జరిగిందని ఆ పార్టీ నేతలు గట్టిగా ప్రచారం చేశారు. అశోక్ గజపతి రాజు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు తనకు భజన చేసే కొందరిని భుజాలపై ఎక్కించుకున్నారన్న టాక్ కూడా ఉంది. అశోక్ గజపతి రాజు దగ్గరికెళ్లి మీ కష్టాలు చెప్పుకునే వీలుండదు, మా దగ్గరకు వస్తే మీ బాధలు సమస్యలు వినడానికి ఇరవైనాలుగ్గంటలు తలుపులు తెరిచే ఉంటాయి అంటూ అప్పట్లో జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇచ్చిన నినాదం కూడా ఓట్ల వర్షం కురిపించిందని పరిశీలకులు అంటున్నారు.


సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ అధికారం తమదేనన్న అతి విశ్వాసం నిలువున ముంచినా ఇప్పటికీ జిల్లా టిడిపి నేతలు కళ్ళుతెరవలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. భవిష్యత్ కార్యాచరణపై వారిలో ఆలోచన లేదట పార్టీ జిల్లా అధ్యక్ష ఎన్నిక విషయంలోనే అశోక్ గజపతి రాజు పెద్ద తప్పు చేశానన్న భావన స్థానిక నాయకులలో ఉంది. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్న చందంగా అశోక్ వ్యవహరించడమే పార్టీ పరాజయానికి మూల కారణమని ఇప్పుడు తెలుగు తమ్ముళ్లు మాట్లాడుకుంటున్నారు. అశోక్ గజపతి రాజు కేంద్రమంత్రిగా ఉన్నన్నాళ్లు ఐయామ్ సెంట్రల్ అనేవారు. తద్వారా జిల్లా రాజకీయాలను పూర్తిగా పక్కనబెట్టేశారు. ఇప్పటికీ ఇదే తీరుని కొనసాగిస్తున్నారన్నది తమ్ముళ్ల అభిప్రాయం. ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి ప్రజలకే కాదు పార్టీ కార్యకలాపాలకు కూడా తన అనారోగ్య కారణాల రీత్యా పూర్తిగా దూరంగా వుంటున్నారు.


మౌనమే నీ భాష ఓ మూగ మనసా అన్నట్టుగా ఉందట అశోక్ వ్యవహారశైలి. విజయనగరం ఎంపీగా పోటీ చేసిన అశోక్ అరకు ఎంపీగా పోటీ చేసిన కిషోర్ చంద్ర దేవ్ ఎన్నికల ఫలితాల తర్వాత ఎక్కడున్నారన్నది కార్యకర్తలకే కాదు పార్టీ నాయకులకు కూడా తెలియదట. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటీవల అన్న క్యాంటిన్ల మూసివేతకు నిరసనగా ఇసుక విధానానికి వ్యతిరేకంగా రాష్ట్రమంతా తెలుగుదేశం ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే విజయనగరం జిల్లాలో మాత్రం ఉన్నతాధికారులకు ఒక వినతి పత్రాన్ని మొక్కుబడిగా అందించి టిడిపి నేతలు చేతులు దులుపుకున్నారు.



ఈ జిల్లా నుంచి టిడిపి ప్రభుత్వ హయాంలో మంత్రిగా వ్యవహరించిన సుజయ్ కృష్ణ రంగారావు ఒకటో అరో అధికార పక్షంపై విమర్శలు చేస్తున్న ఆ ఎఫెక్ట్ పెద్దగా ప్రజల్లో కనిపించడం లేదు. ఇక విజయనగరం జిల్లా టిడిపి అధ్యక్షుడు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది అని పార్టీ వర్గాలు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన నాయకులలో చాలామంది వైఖరి ఎలా ఉన్నా జిల్లా కార్యకర్తలు మాత్రం నేటికీ పసుపు జెండాపై గొప్ప విశ్వాసంతోనే ఉన్నారు. జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఎన్ని ఒట్లు వచ్చాయో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా అన్నే ఓట్లు రావడం గమనార్హం. అయితే కొత్త ఓటర్లను ఆకర్షించలేకపోవడం జిల్లా టిడిపి నేతల్లో జవాబుదారీతనం పూర్తిగా కొరవడటం ఏదైనా సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలో కార్యకర్తలు కొట్టుమిట్టాడడం వంటి కొన్ని అంశాలు ఎన్నికల్లో పార్టీకి తీవ్రంగా నష్టం చేశాయి.



అవే సమస్యలు నేటికి కొనసాగడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇకనైనా రాష్ట్ర నాయకత్వం కల్పించుకొని గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని జనంతో కలిసి ఉన్న నేతలకు ప్రాధాన్యమివ్వాలని యువ నాయకత్వాన్ని ప్రోత్సంచాలని టిడిపి కార్యకర్తలు అభిమానులు కోరుతున్నారు. అధికార పక్షం అవలంబించే ప్రజావ్యతిరేకవిదానాలపై పొలికేక వేసే నాయకుడు తమ ముందుంటే తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం రావడం ఖాయమని తమ్ముళ్లు చెబుతున్నారు. మరి ఈ దిశగా టిడిపి అధిష్టానం ఎలాంటి చర్యలు చేపడుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: