మరోసారి నవంబర్‌ 26 తరహా దాడులకు పాకిస్థాన్‌ కుట్ర పన్నిందా? ఈ సారి దక్షిణ భారతాన్ని ఉగ్రవాదులు టార్గెట్‌ చేశారా..? ఇంతకీ నిఘా వర్గాలు  చెబుతున్నదేమిటి..?  భద్రతా సంస్థలు అప్రమత్తం కావడానికి కారణం ఏమిటి..? 


కాశ్మీర్ మీదుగా భారత్‌లోకి చొరబడి విధ్వంసం సృష్టించాలన్న పాకిస్థాన్‌ ఎత్తులు పారడం లేదు. వాస్తవాధీన రేఖ వెంబడి భద్రతను కట్టుదిట్టం చేయడంతో చొరబాట్లకు ఆస్కారం లేదు. దీంతో తమ పాత వ్యూహానికి పాకిస్థాన్‌ పదును పెట్టినట్టు తెలుస్తోంది. గతంలో లానే సముద్ర మార్గంలో ఉగ్రవాదుల్ని భారత్‌లోకి పంపి విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నిస్తోందంటున్నాయి నిఘా వర్గాలు.  భారత్‌లో దాడులకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్టు ఆర్మీ కమాండర్‌ లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ ఎస్‌కే సైనీ తెలిపారు. అయితే ఈ సారి దక్షిణ భారతంలో భీకర దాడులకు  ప్లాన్‌ చేసినట్టు నిఘా వర్గాల నుంచి సమాచారం అందిందని స్పష్టం చేశారు. ఇటీవల గుజరాత్‌ తీరంలోని సర్‌ క్రీక్‌ వద్ద అనుమానాస్పద రీతిలో పడవలు కన్పించాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు... తీర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.     


మరోవైపు... ఆర్మీ హెచ్చరికలతో కేరళ పోలీసులు అప్రమత్తమయ్యారు. రద్దీ ప్రదేశాలు, బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టుల వద్ద భద్రతను పెంచాలని అన్ని జిల్లాల పోలీసులకు ఆదేశాలు వెళ్లాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రద్దీ ప్రదేశాల్లో హైఅలర్ట్‌ ప్రకటించారు. తమిళనాడులో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు.  శ్రీలంక నుంచి సముద్ర మార్గంలో కొందరు ముష్కరులు దేశంలోకి చొరబడినట్టు ఇటీవల నిఘా వర్గాలు తెలిపాయి. దీనికి తోడు... గుజరాత్‌ తీరంలో ఖాళీ పడవలు కనిపించడంతో ఏదో జరుగుతోందనే సందేహాలకు తావిస్తోంది. దీంతో నేవీ, కోస్టు గార్డులు, మెరైన్‌ పోలీసులు తీర ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: