వరంగల్‌లో కాళోజీ పేరుతో నిర్మిస్తున్న కళా క్షేత్రానికి నిధుల కొరత ఏర్పడింది. రవీంద్ర భారతికి ధీటుగా నిర్మిస్తున్న కళా క్షేత్రం నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. పనులు మొదలు పెట్టి ఐదేళ్లు గడిచినా ఇప్పటి వరకు 30శాతం నిర్మాణం మాత్రమే పూర్తయ్యింది.


హైదరాబాద్‌లో ఏ సాంస్కృతిక సంబురం జరిగినా రవీంద్రభారతి పేరు టక్కున గుర్తుకొస్తుంది. అలా సాంస్కృతిక కార్యక్రమాలకు వరంగల్‌ నగరంలో చక్కని వేదికను నిర్మించాలనుకున్నారు సీఎం కేసీఆర్‌. హన్మకొండ బాలసముద్రంలో 2014 సెప్టెంబరు 9న కాళోజీ కళాక్షేత్రం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రవీంద్ర భారతికి ధీటుగా అత్యంత అధునాతనంగా  కాళోజీ కళాక్షేత్రం భవనాన్ని డిజైన్‌ చేశారు. 4.5 ఎకరాల విస్తీర్ణంలో 12వేల 990 చ.మీ. వైశాల్యంతో భవనాన్ని నిర్మించాలని భావించారు. నిర్మాణానికి 50 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. 201516 నుంచి మూడేళ్లపాటు బడ్జెట్లో నిధులు కేటాయించింది ప్రభుత్వం. ఈ కళ క్షేత్రాన్ని మూడు దశల్లో పూర్తి చేయాలని నిర్ణయించింది.


జీ ప్లస్‌ 4 విధానంలో  నాలుగు అంతస్తులుగా నర్మించేందుకు డిజైన్ చేశారు. మొదటి దశలో భవనం సూపర్‌ స్ట్రక్చర్‌ నిర్మాణం, రెండో దశలో ఇంటీరియర్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్ పనులు, మూడో దశలో ల్యాండ్‌ స్కేపింగ్‌, పాథ్‌ వే, పార్కింగ్‌ ఇతర పనులు చేపట్టాల్సి ఉంది. ఇలా అద్భుత డిజైన్‌తో భవవనిర్మాణం ప్రారంభమైనా.. నిధుల కొరతతో నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. రెండేళ్లలోనే నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఐదేళ్ల కిందట ఈ పనులు మొదలుపెట్టినా.. ఇప్పటి వరకూ 30 శాతం పనులు కూడా పూర్తి కాలేదు. చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో  కాంట్రాక్టర్‌ పనులను నిలిపివేశారు. కాళోజీ కళా క్షేత్రం పనులు నిలిచిపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శంకుస్థాపన సమయంలో ఒకటి రెండేళ్లలో పూర్తి చేస్తామని ప్రకటించి ఐదేళ్లయినా  కళాక్షేత్రం పనులు జరగకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందులోను నిధుల కొరత కారణం చూపి, పనులు ఆపివేయడం తగదంటున్నారు. పనుల పూర్తికి సీఎం ప్రత్యేక చొరవ తీసుకోవాలని కవులు, రచయితలు కోరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: