బీజేపీ ప్రభుత్వం నోట్ల రద్దు చేసిన సమయంలో డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం కు బాగా ప్రాముఖ్యత పెరిగింది. ప్రజలు ఆ సమయంలో డిజిటల్ చెల్లింపులపై ఎక్కువగా ఆధారపడటం, పేటీఎం కు పోటీనిచ్చే కంపెనీలు కూడా ఎక్కువ సంఖ్యలో లేకపోవటంతో పేటీఎం ఆదాయం కూడా బాగా పెరిగింది. కానీ ప్రస్తుతం ఈ కంపెనీ భారీగా నష్టాలను చవిచూస్తున్నట్లు తెలుస్తుంది. 2019 మార్చి 31 తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో పేటీఎం కంపెనీ భారీ నష్టాన్ని నమోదు చేసింది. 
 
ప్రస్తుతం పేటీఎంకు డిజిటల్ చెల్లింపుల సంస్థల నుండి పోటీ తీవ్రంగా పెరిగింది. ఫోన్ పే, గూగుల్ పే లాంటి డిజిటల్ చెల్లింపు సంస్థల నుండి పేటీఎంకు తీవ్రంగా పోటీ ఎదురవుతుంది. గత ఆర్థిక సంవత్సరంలో రోజుకు 11 కోట్ల రుపాయల చొప్పున పేటీఎం నష్టపోయినట్లు తెలుస్తుంది. పేటీఎం కంపెనీ వాటాదారులతో మాతృక సంస్థ అయిన వన్97 కమ్యూనికేషన్స్ కంపెనీ వార్షిక ఫలితాలను పంచుకుంది. 
 
కంపెనీ వార్షిక ఫలితాల ప్రకారం పేటీఎం గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీకి 4,217 కోట్ల రుపాయల నష్టం నమోదు చేసింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఈ నష్టం 1604 కోట్ల రుపాయలుగా ఉంది. 1604 కోట్ల రుపాయల నష్టంతో పోలిస్తే 162 శాతం నష్టం పెరిగింది. అంటే ఒక రోజుకు 11 కోట్ల రుపాయల కంటే ఎక్కువ మొత్తంలోనే నష్టం వచ్చినట్లు లెక్క. 
 
కంపెనీ ఆదాయం మాత్రం అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఆదాయంతో పోలిస్తే పెరగటం విశేషం. పేటీఎం కంపెనీ బ్రాండ్ విలువను పెంచుకోవటం కొరకు ఎక్కువ ఖర్చు చేసినట్లు తెలుస్తుంది.  2021 సంవత్సరం నాటికి లాభాల దిశగా పయనిస్తామని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది. ప్రస్తుతం పేటీఎం కంపెనీ మొబైల్ వాలెట్, హోటల్, టికెటింగ్, ట్రావెల్, ఇన్స్యూరెన్స్ పై మరింత దృష్టి సారించనున్నట్లు  తెలిపింది. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: