మత సామరస్యానికి ప్రతీక అక్కడ జరిగే రొట్టెల పండుగ, రొట్టె పడితే మీ కోరిక తీరినట్టే, కులం, మతం, ప్రాంతం, పేద, గొప్ప అనే తేడా లేకుండా దేశం నలుమూలల నుంచి అక్కడికి ప్రజలు తరలి వస్తుంటారు. భార షాహిద్ అని పిలవబడే అమరవీరులను దర్శించుకోవడానికి భక్తులు ఎగబడతారు. నెల్లూరు జిల్లాలో ఇవాళ మొదలయ్యే ఈ పండుగ ఐదు రోజులపాటు జరుగుతుంది. నెల్లూరు రొట్టెల పండుగ వచ్చిందంటే బంధువులు స్నేహితులతో ఇళ్లన్నీ కళకళలాడిపోతాయి. విదేశాల్లో ఉన్నవారు కూడా రొట్టెల పండుగకు నెల్లూరు చేరుకుంటారు.

ఖచ్చితంగా వచ్చి తమ మొక్కులను తీర్చుకుంటారు. అదే విధంగా కొత్తగా తమ కోర్కెల రొట్టెలను పట్టుకుంటారు. విద్య, ఆరోగ్యం, వివాహం, సంతానం, ఉద్యోగం, విదేశీయానం ఇలా కావలసినన్ని కోర్కెలకు ఇక్కడ రొట్టెలు దొరుకుతాయి. రొట్టె పడితే చాలు కోరిన కోర్కెలు నెరవేరుతాయనేది ఇక్కడ భక్తుల విశ్వాసం. ఇక్కడకు వచ్చే భక్తులు ఏటేటా పెరిగిపోతున్నారు. గత పది సంవత్సరాల్లో లక్ష నుంచి పన్నెండు లక్షలకు భక్తుల సంఖ్య చేరుకుందంటే నమ్మకం ఏ స్థాయిలో ఉందో అర్ధమవుతోంది. ఈ రోజు షహదత్ తో పండుగ ప్రారంభమైంది.


రేపు గంధమహోత్సవం చేస్తారు కోటమిట్ట అమీనా మసీదు నుంచి గంధాన్ని తీసుకు వచ్చి పన్నెండు మంది షహీద్ సమాధులకు లేపనం చేసి భక్తులకు పంచుతారు. మరుసటి రోజు తమ కోర్కెలు తీరాలని భక్తులు వివిధ రకాల రొట్టెలను ఒకరికొకరు మార్చుకుంటారు. పద్నాలుగున ముగింపు సభతో రొట్టెల పండుగ ముగుస్తుంది. బారా షహీద్ లను ప్రార్థిస్తూ తమ కోర్కెలను తీర్చుకోవాలని భక్తులు స్వర్ణాల చెరువులో రొట్టెలను ఒకరికొకరు మార్చుకుంటారు. ఐదు రోజుల పాటు జరిగే పండుగకు అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తోంది. పారిశుద్ధ్యం నిర్వహణ కోసం నాలుగు వేల ఐదు వందల మంది కార్మికులను కాంట్రాక్టు పద్ధతిని తీసుకుంటున్నారు.

దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు సేద తీరేందుకు కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఎనిమిది వేల చదరపు అడుగులతో జింక్ సీటింగ్ షామియానాల ఏర్పాట్లు చేశారు. మంత్రి అనిల్ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పనులను పర్యవేక్షిస్తున్నారు. రొట్టెల పండుగలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఉండేందుకు పోలీసు యంత్రాంగం పూర్తిస్థాయిలో సిద్ధమయ్యింది. రెండు వేల మంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. బారా షహీద్ దర్గా ఆవరణ మొత్తం యాభై కెమెరాల నిఘాలో ఉండనుంది. దర్గా ఆవరణలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు పోలీసు శాఖ కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసింది. రొట్టెల పండుగకు వచ్చే భక్తులకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. అయితే భక్తుల నుంచి అదనంగా యాభై శాతం చార్జీలు వసూలు చేస్తోంది.




మరింత సమాచారం తెలుసుకోండి: