ప్రకాశం జిల్లాలో ప్రతిపక్ష పార్టీ నేతలు హడలిపోతున్నారు. ప్రతిపక్ష నేతలే టార్గెట్ గా జిల్లాలో విజిలెన్స్ దాడులు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రానైట్ క్వారీలో తనిఖీల పేరుతో రోజుల తరబడి నేతలను వేధిస్తున్నారని విమర్శలు గుప్పుమంటున్నాయి. జిల్లాలో జరుగుతున్న విజిలెన్స్ తనిఖీలు ప్రతిపక్ష పార్టీల నాయకులను లొంగదీసుకోవడానికే అన్న టాక్ రాజకీయ వర్గాల్లో వినపడుతోంది. ప్రపంచంలోనే అత్యంత అరుదైన గెలాక్సీ గ్రానైట్ నిక్షేపాలు ప్రకాశం జిల్లా చీమకుర్తిలో ఉన్నాయి. దీని పరిసర ప్రాంతాల్లో బడా కంపెనీలు గ్రానైట్ నిక్షేపాలు వెలికి తీస్తూ వేల కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నాయి.


జిల్లాలోని చీమకుర్తి బల్లికురవ మండలాల్లో రెండు గుంతల గ్రానైట్ క్వారీలు ఉన్నాయి. ఇక్కడ గ్రానైట్ వెలికిదీసి విదేశాలకు పెద్దఎత్తున కంపెనీలు ఎగుమతులు చేస్తున్నాయి. వీటిలో సగానికి పైగా క్వారీలు అధికార ప్రతి పక్ష పార్టీల నేతలకు చెందినవిగా సమాచారం. గ్రానైట్ క్వారీల్లో నలభై ఐదు రోజులుగా విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం జరుగుతున్న తనిఖీలు ప్రతిపక్ష పార్టీల నేతలను ఇబ్బంది పెట్టడానికైనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రానైట్ తవ్వకాలు జరిపే ఏ ఒక్క కంపెనీ నిబంధనలను పాటించదు. ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించకుండానే గ్రానైట్ రాళ్లు అక్రమంగా తరలించేస్తుంటారు. తమకు అనుకూలంగా ఉండే పార్టీ అధికారంలో ఉన్న సమయంలో గ్రానైట్ తరలింపు మరింత ఎక్కువగా ఉంటుంది.



ఇదే ఇప్పుడు అధికార పార్టీకి అనుకూలంగా మారిందనే టాక్. ప్రతి పక్ష పార్టీ నాయకుల గ్రానైట్ తవ్వకాలను పరిశీలిస్తూ సొంతవారిని చూసీ చూడనట్లు వదిలేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. దీంతో పాటుగా గ్రానైట్ ను తరలించే విషయంలోనూ ప్రతి పక్ష పార్టీ నాయకుల లారీలే టార్గెట్ గా విజిలెన్స్ దాడులు జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఇప్పటి వరకు అధికారులు పట్టుకున్న లారీలు కూడా ప్రతి పక్ష ఎమ్మెల్యేలు వారి అనుచరులవే కావడంతో ఆరోపణలకు మరింత బలం చేకూరుతోంది. ఇప్పటికే జరిపిన గ్రానైట్ తవ్వకాలలో అక్రమాలకు ఒక్కో క్వారీకి ఐదు నుండి ఇరవై కోట్ల రూపాయలకు పైగా జరిమానా విధించే అవకాశం ఉందని విజిలెన్స్ అధికారులు చెబుతున్నారు. కానీ దీంట్లో ప్రతి పక్ష పార్టీ నేతలే టార్గెట్ అవుతున్నారని జిల్లాలో పొలిటికల్ టాక్.



మరింత సమాచారం తెలుసుకోండి: