కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వాహన చట్టంపై అటు రాజకీయ నేతలు ఇటు ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చట్టం అమల్లోకి వచ్చిన మొదటి రోజు నుంచే అధికారులు చర్యలు ప్రారంభించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచి భారీ మొత్తంలో జరిమానాలు వసూలు చేస్తున్నారు. కొత్త వాహన చట్టం కింద నిబంధనలు ఉల్లంఘించి తాను జరిమానా కట్టానని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా తెలిపారు.


వాహన చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చిన తానే నిబంధనలు ఉల్లంఘించి ఫైన్ కట్టడం షాకింగ్ గా ఉందని మరికొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. బాంద్రా వర్లీ ప్రాంతంలో అతివేగంగా కారు నడిపినందుకు తన కారుకు ఫైన్ వేశారని గడ్కరీ చెప్పుకొచ్చారు. అయితే రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ఈ చట్టం తీసుకొచ్చామని అన్నారు. మోటర్ వెహికల్ సవరణల చట్టం తీసుకు రావడం పట్ల తమ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నానని ఆయన చెప్పారు. భారీ జరిమానాల కారణంగా అవినీతి తగ్గుతుందనీ, రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా చాలా వరకు నియంత్రించవచ్చు అని అన్నారు.


అంతేకాదు ట్రాఫిక్ నిబంధనలు పాటించేవారు జరిమానాలకి భయపడాల్సిన అవసరం లేదని ఆయన సమర్థించారు. మరోవైపు సామాన్య ప్రజల నుంచి ఈ చట్టానికి వ్యతిరేకత వస్తోంది . ఉన్నట్టుండి చట్టం పేరుతో భారీ మొత్తంలో జరిమానాలు విధిస్తే తాము ఎలా కట్టాలి అని కొందరు విమర్శిస్తున్నారు. అంతేకాదు గతంలో ఎప్పుడో పెండింగ్ లో ఉన్న చలాన్ లకు కూడా మనీ వసూలు చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మోటార్ వెహికల్ చట్టం సామాన్యులకే కాదు నేతలకు కూడా వణుకు తెప్పిస్తోంది. కొందరైతే ఫైన్ చెల్లించలేక తమ వాహనాలను పోలీసుల వద్దనే వదిలేసి వెళ్తున్నారు.





మరింత సమాచారం తెలుసుకోండి: