మనదేశంలో కులం పేరుతో, మతం పేరుతో జరిగిన అన్యాయాలు, కలహాలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా కులం పై ఉన్న మూఢనమ్మకాలని పారద్రోలడానికి మన రాజ్యాంగంలో ఎన్నో చట్టాలను అమలు చేశారు... సవరించారు కానీ పెద్ద పెద్ద హోదాల్లో ఉన్న నాయకులే వాటిని విస్మరిస్తున్నారు. తాజాగా సాక్షాత్తు లోక్సభ స్పీకర్ అయిన ఓం బిర్ల బ్రాహ్మణులు పుట్టుకతోనే గొప్ప వారిని.... ఇతర కులాలను వారు ముందు ఉండి నడిపిస్తున్నారని అనడం గమనార్హం.

కోట లోని ఒక అఖిల బ్రాహ్మణ మహాసభలో మాట్లాడుతూ బ్రాహ్మణ కులానికి చెందిన వారు మిగతా కులాలకు మార్గదర్శకంగా ఉంటారని ఆయన అన్నాడు.  సమాజంలో చదువు మరియు విలువలను విస్తరించేందుకు వీరు ఎల్లవేళలా కృషి చేస్తూ ఉంటారు అని అన్నాడు. బ్రాహ్మణ కులస్థులు పుట్టుకతోనే సమాజంలో గొప్పవారిగా కీర్తించబడతారని అందుకు వారి సేవ మరియు త్యాగాలే కారణమని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. ఇదే విషయాన్నిఆయన ట్విట్టర్ లో మరియు ఫేస్ బుక్ లో కూడా రాశారు.

ఈ విషయంలో ఆయనపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. అత్యంత గౌరవనీయమైన పదవిలో ఉంటూ ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏ మాత్రం సబబుగా లేదని వారు అన్నారు. 'పీపుల్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్, రాజస్థాన్ ప్రెజిడెంట్ అయిన కవిత శ్రీవాత్సవ్ ఓమ్ బిర్లా అన్న మాటల్ని వెనక్కి తీసుకోవాలని లేదా ఆర్టికల్ 14 ప్రకారం చట్ట పరంగా ఆయనపై కేసు నమోదు చేయాల్సి ఉంటుందని అన్నారు. బ్రాహ్మణుల సమ్మేళన సభకు వెళ్లి వారిని చైతన్య పరచాల్సింది పోయి... వారిని పొగిడి.. మిగతావారి నుంచి వేరుచేసి అత్యున్నతంగా చూపించడం ఏ మాత్రం బాగా లేదని సోషల్ మీడియా ప్రజలంతా ఆయనపై విమర్శలు కురిపిస్తున్నారు. ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: