తెలంగాణలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. దాదాపు నెల రోజుల నుంచి ఆసుపత్రుల జనాలతో కిటకిటలాడుతున్నాయి. ఇంటికో జ్వర బాధితుడు ఉన్నాడు, విపక్షాలు, మంత్రి ఉరుకులు పరుగులు పెడుతున్నా ఎవ్వరికీ అంతుపట్టటం లేదు. ఇంత జరుగుతున్నా ఆసుపత్రుల్లో డాక్టర్ లపై పర్యవేక్షణ చేసే వైద్య విధాన పరిషత్ కమీషనర్ పోస్టును మాత్రం ఖాళీగా ఉంచింది ప్రభుత్వం. తొమ్మిది నెలలుగా ఇన్ చార్జి తోనే నడిపిస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్ లపై పర్యవేక్షణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ బాధ్యత. ఇలాంటి కీలక పోస్టును దాదాపు తొమ్మిది నెలలుగా ఖాళీగా ఉంచింది వైద్యశాఖ. ఒక వైపు విషజ్వరాలతో ప్రభుత్వ ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి తక్షణ నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి.


తెలంగాణలో మొత్తం నూట రెండు జిల్లా ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, కమ్యునిటీ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. ఇందులో డాక్టర్లే మూడు వేల మంది వరకు ఉన్నారు. సుమారు పదమూడు వేల మందికి పైగా వైద్య సిబ్బంది పని చేస్తుంటారు. ఇవన్నీ పర్యవేక్షించేది వైద్య విధాన పరిషత్ కమిషనర్, మరో విచిత్రమేంటంటే డాక్టర్ లు ఈ వృత్తిలో అనుభవమున్న అధికారులు పర్యవేక్షించాల్సిన ఈ బాధ్యతను ఏకంగా ఓ కలెక్టర్ కు ఇచ్చారు. అది కూడా ఎక్కువ పని బాధ్యత ఉండే హైదరాబాద్ కలెక్టర్ గా ఉన్న మాణిక్ రాజ్ కు ఓ జిల్లాకు కలెక్టర్ గా ఉంటూ ఓ రాష్ట్ర స్థాయి పోస్టుకు ఇన్ చార్జిగా ఉండటం కూడా ఇదే తొలిసారి.



తొమ్మిది నెలల క్రితం వైద్య విధాన పరిషత్ కమిషనర్ గా ఉన్న శివ ప్రసాద్ రిటైర్డు అయినప్పటి నుంచీ ఇదే పరిస్థితి. ఈ విషయంపై డాక్టర్ లు కొందరు కోర్టుకు వెళ్లారు, డాక్టర్ వృత్తిలో అనుభవం ఉన్న వారికే ఇన్ చార్జిగా ఇవ్వాలని లేఖ రాసి కమిషనర్ పోస్టును భర్తీ చేయాలని న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు. ఏవో కుంటిసాకులు చెబుతూ న్యాయస్థానాల్లో వాయిదాలు వేస్తూ ఉన్నారు తప్ప కమిషనర్ నియామకం జరగలేదు. రాష్ట్రంలో డెంగ్యూ, టైఫాయిడ్ వంటి జ్వరాలతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో దోపిడి తట్టుకోలేక ఎక్కువ మంది ప్రభుత్వాసుపత్రులు ముందే క్యూ కడుతున్నారు.



ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల ఇప్పటికే హైదరాబాద్ లోని నీలోఫర్, ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులతో పాటు జిల్లాలోని కొన్ని ఆసుపత్రులను పరిశీలించారు. కేటీఆర్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక మరుసటి రోజే సీజనల్ వ్యాధులపై గ్రేటర్ లో మంత్రితో కలిసి సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కమిషనర్ పోస్టు ఖాళీగా ఉండటం పై కూడా కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ముగ్గురు ఐఏఎస్ ల లాబీ ఏ ఈ పోస్టును భర్తీ చేయకుండా అడ్డుకుంటున్నట్లు వైద్య విధాన పరిషత్ అధికారులు డాక్టర్ లు ఆరోపిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: