ఉభయగోదావరి లంకగ్రామాల్లో జలప్రళయం వచ్చిందా అన్నట్టుగా గోదావరి ఉప్పొంగింది. ఉపనదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటం అంతకంతకు వరద నీరు పెరుగుతూ ఉండడంతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. దేవి పట్టణాన్ని ముంచేసి దిగువకు ఉరుకుతూ ధవళేశ్వరం బ్యారేజిని దాటుకుని వడివడిగా కడలి దరికి పరుగుతీస్తోంది గోదావరి. కోనసీమ లంకలని ముంచేసి నదీ తీర గ్రామాల ప్రజలను గజగజ వణికిస్తోంది. ఈ సీజన్ లో ఇప్పటికే రెండు సార్లు వచ్చిన వరదలు మిగిల్చిన నష్టాల నుంచి ప్రజలు ఇంకా తేరుకోనే లేదు. ఈలోపే మరోసారి గోదావరి ఉగ్రరూపం దాల్చింది.ఎగువ నుంచి పోటెత్తుతున్న వరద నీటితో జలప్రళయం సృష్టించింది. ఫలితంగా లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఏజెన్సీ విలీన మండలాలతో పాటు దిగువన ఉన్న కోనసీమ లంక గ్రామాలు కూడా నీళ్లలోనే ఉన్నాయి. నెల రోజుల వ్యవధిలో గోదావరికి మూడు సార్లు వచ్చిన వరద దేవీపట్నం మండలం లోని పోలవరం ముంపు గ్రామాలను అతలాకుతలం చేసింది. ప్రజలు పడవల మీదే ప్రయాణం సాగిస్తున్నారు. ప్రధాన రహదారి నీటమునిగిపోయింది, దేవీపట్నం పరిసర ప్రాంతాల్లో పన్నెండు వందల ఇళ్ళు వరదలో చిక్కుకున్నాయి. కాఫర్ డ్యాం వల్లనే తమ ఇళ్లు నీట మునిగాయి అంటున్నారు అక్కడి గ్రామస్తులు. కాఫర్ డ్యాం బ్యాక్ వాటర్ లెవల్స్ భారం ఈ గ్రామాలపై పడుతోంది. భద్రాచలం నుంచి కూడా ఒక్కసారిగా సామర్థ్యానికి మించి వాటర్ వదలడంతో చాలా గ్రామాలు ముంపుకు గురయ్యాయని గ్రామస్థులంటున్నారు.


భద్రాచలం వద్ద నీటి మట్టం స్వల్పంగా తగ్గు ముఖం పట్టింది. ధవళేశ్వరం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. అయితే వరద ప్రవాహం తగ్గుతోందని అధికారులు చెబుతున్నారు. ఈ సీజన్ లో ఇప్పటి వరకు గోదావరి జలాలు రెండు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది టీఎంసీలకు పైగా సముద్రంలో కలిశాయి. గోదావరికి వరద పోటెత్తడంతో కోనసీమలోని గౌతమీ, వైనతేయ, వశిష్ట నది పాయలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మూడోసారి వరదలతో ఉభయ గోదావరి జిల్లాల వాసులు కంటిపై కునుకు లేకుండా గడుపుతున్నారు. గోదావరి వరద ఉధృతి అంతకంతకు పెరుగుతుండడంతో తూర్పు గోదావరి జిల్లాలోని పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి.

మరి కొన్ని గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. గత నాలుగు రోజులుగా మొత్తం ముప్పై ఆరు గ్రామాలు పూర్తిగా జల దిగ్బంధంలోనే చిక్కుకోవడంతో ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బయటకు వెళ్లేందుకు వీలు లేక బిక్కుబిక్కుమంటున్నారు. తీర ప్రాంతాల్లోని రైతులు తీవ్రంగా నష్ట పోయారు. తొయ్యూరు దేవీపట్నం పూడిపల్లి పోచమ్మగండివద్ద రెండు వందలకు పైగా ఇళ్లు నీట మునిగి పోయాయి. దీంతో బాధితులు ఇళ్లు వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. కాజ్ వేలు రోడ్లు వరద నీటితో మునిగిపోవడంతో లంక గ్రామ ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీట మునిగిన గ్రామాల్లోని ప్రజలను రక్షించేందుకు సిబ్బంది సహాయక చర్యలు అందిస్తున్నారు. గిరిజనులు కొండలపై తలదాచుకున్నారు.


చింతూరు, వీఆర్ పురం, ఆంధ్ర, ఒడిస్సాల మధ్య రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. విలీన మండలాల్లో పంతొమ్మిది గ్రామాలు జల దిగ్బంధంలో ఉన్నాయి. కొత్తపేట నియోజక వర్గంలో సుమారు రెండు వేల ఐదు వందల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ధవళేశ్వరం ఆనకట్ట నుంచి వరద నీటిని దిగువకు విడుదల చేసిన కారణంగా గోదావరి పరివాహక ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. గౌతమి, వృద్ధగౌతమి పాయలు పోటెత్తి ప్రవహిస్తున్నాయి. యానాం లోని బాలయోగి నగర్ ఉదయ్ కృష్ణ కాలనీ వరద నీటిలో చిక్కుకుంది. సుమారు ఐదు వందల కుటుంబాలు వరద బారిన పడ్డాయి. ప్రభుత్వం పునరావాస కేంద్రాల్ని ఏర్పాటు చేసినా ప్రజలు ఇళ్లు వదిలి వెళ్లడానికి ఇష్టపడట్లేదు. వీఆర్ పురం కూనవరం ఎటపాక మండలాల్లో సుమారు యాభై గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.




మరింత సమాచారం తెలుసుకోండి: