తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగాలలో లీగల్‌ సెల్‌కు ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉందని పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబునాయుడు అన్నారు. గుంటూరు నగరంలోని బండ్లమూడి గార్డెన్స్‌ వేదికగా జరిగిన పార్టీ న్యాయ విభాగ ఆత్మీయ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రజలతో అనుసంధానం ఎక్కువగా ఉండే ఏకైక విభాగం న్యాయ విభాగమని చంద్రబాబు చెప్పుకొచ్చారు. స్వాతంత్య్ర ఉద్యమం నుంచి సమైక్యాంధ్రప్రదేశ్‌ ఉద్యమం వరకు జరిగిన పోరాటాలలో న్యాయవాదుల పాత్ర అనిర్వచనీయమన్నారు. 

నిరంతర శోధన, సాధన, వాదన పటిమ ద్వారా సమాజాభివృద్ధికి దోహదపడే న్యాయవాదుల నుంచి నాయకులు పుట్టుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. న్యాయవాదులు డబ్బు, పదవులు కోరుకోరని కేవలం గౌరవం మాత్రమే కాంక్షిస్తారని.. వైసీపీ ప్రభుత్వంలో ఆ గౌరవం వారికి లోపించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం హయాంలో వైసీపీ శ్రేణులకు కూడా సంక్షేమ ఫలాలు అందిస్తే.. వైకాపా మాత్రం కక్ష సాధింపులతో 100 రోజుల్లోనే ''ఛలో ఆత్మకూరు'' కార్యక్రమాన్ని నిర్వహించాల్సిన పరిస్థితి తీసుకొచ్చిందని  చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.  


వైసీపీ కక్ష సాధింపులకు బలవుతున్న కార్యకర్తలను లీగల్‌ సెల్‌ సభ్యులు అండగా నిలబడి.. వారిని ఆదుకోవాలని చంద్రబాబు సూచించారు. అనంతరం టీడీపీ శ్రేణులపై వైసీపీ సభ్యులు అక్రమంగా పెడుతున్న కేసులపై ఏవిధంగా లీగల్‌ సెల్‌ సభ్యులు స్పందించాలనే దానిపై హైకోర్టు మాజీ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాసరావు, హైకోర్టు మాజీ పీపీ పోసాని వెంకటేశ్వరరావు, హైకోర్టు మాజీ జీపీ కే.ఎం.కృష్ణారెడ్డి సహా పలువురు న్యాయ నిపుణులు సలహాలు, సూచనలు చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు, పార్టీ లీగల్‌ సెల్‌ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్‌,  టీడీపీ లీగల్‌ సెల్‌ సభ్యులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: