వినాయక నిమజ్జనం సందర్భంగా అపశృతి చోటు చేసుకున్నారు. గణేష్ నిమజ్జనం చిన్నారులకు శాపంగా మారింది. కర్ణాటకలోని కేజీఎఫ్ తాలూకాలోని మరథఘట్ట గ్రామంలో వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేస్తూ ఆరుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. అక్కడి పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం… మరథఘట్ట గ్రామానికి చెందిన ఎనిమిది మంది చిన్నారులు వినాయకుడిని నిమజ్జనం చేసేందుకు చెరువు వద్దకు వెళ్లారు. వీరిలో ఆరుగురు విగ్రహంతో చెరువులో దిగారు. ఇద్దరు ఒడ్డున నిల్చున్నారు. విగ్రహాన్ని పట్టుకుని చెరువులోకి దిగిన ఆరుగురు చిన్నారులు క్రమ క్రమంగా మునిగిపోయారు. దీంతో బయట నిలబడిన ఇద్దరు భయంతో గ్రామంలోకి పరుగులు తీశారు. వారు నీటిలో మునిగిపోతున్న విషయాన్ని గ్రామ పెద్దలకు తెలియజేశారు. గ్రామస్తులు చెరువు వద్దకు చేరుకునే సరికే చెరువులో దిగిన ఆరుగురు చిన్నారులు మృతి చెందారు. అందకే ముందే వినాయకున్ని ఊరేగింపు చేస్తూ, ఆడుతూ.. పాడుతూ ఆనందోత్సవాల మధ్య నిమజ్జనానికి బయలుదేరి, ఒకే సారి ఆరుగురు చిన్నారులు మరణించడంతో తీవ్ర విషాద నెలకొంది. సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు, కుటుంబ సభ్యలు చెరువు వద్దకు చేరుకుని కన్నీరు  మున్నీరయ్యారు. ముక్కుపచ్చలారని చిన్నారులు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మృతి చెందిన వారిలో తేజశ్రీ (11), ఆమె 8 ఏళ్ల సోదరి రక్షిత, వైష్ణవి (12), ఆమె సోదరుడు రోహిత్ (10), రోహిత్ (10), ధనుష్ (10)లు ఉన్నారు. వీరందరూ మరథఘట్టకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. చిన్నారుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రెండు లక్షల రూపాయల చొప్పన పరిహారం ఇవ్వనున్నట్టు ప్రకటించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: