తెలంగాణ‌లోని ప్రాజెక్టులు మ‌రోమారు జ‌ల‌క‌ల‌ను సంత‌రించుకున్నాయి.  ఎగువన కురిసిన వర్షాలతో కృష్ణా బేసిన్‌లో ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. నెలరోజుల్లో రెండోసారి ఎగువన ఆల్మట్టి నుంచి దిగువన పులిచింతల వరకు అన్ని ప్రాజెక్టుల గేట్లెత్తారు. జూరాలకు ఎగువన నారాయణపుర నుంచి భారీ ఇన్‌ఫ్లోలు వచ్చి చేరుతున్నాయి. అక్కడి నుంచి విడుదలవుతున్న జలాలకు తుంగభద్ర నీళ్లు తోడవడంతో ఐదు రోజులుగా శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తుతున్నది. ఎగువ నుంచి తుంగభద్ర జలాశయానికి వరద కొనసాగుతున్నది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు అప్పర్ తుంగ, భద్ర నదులకు వరద స్థిరంగా కొనసాగుతుండటంతో అప్పర్ తుంగ, భద్ర ప్రాజెక్టుల నుంచి తుంగభద్ర జలాశయానికి వరద జలాలను విడుదల చేస్తున్నారు. 


ఈ సీజన్‌లో భారీ వరదతో శ్రీశైలం నుంచి సాగర్‌కు ఇప్పటివరకు 680 టీఎంసీల వరకు జలాలు చేరాయి. సోమవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జలాశయం 4 గేట్లు ఎత్తిన అధికారులు.. రాత్రికి మరో రెండు గేట్లు ఎత్తి మొత్తం ఆరుగేట్ల ద్వారా నాగార్జునసాగర్‌కు సుమారు 3.19 లక్షల క్యూసెక్కులను విడుదలచేస్తున్నారు. దీనితో పాటు ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 42,378 క్యూసెక్కులు, కుడిగట్టు కేంద్రం ద్వారా 29,498 క్యూసెక్కుల నీటిని నదిలోకి వదులుతున్నారు. మంగళవారం ఎన్నెస్పీ అధికారులు ప్రాజెక్టు 24 క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేరకు ఎత్తి 3,59,352 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదలచేస్తున్నారు. శ్రీశైలం నుంచి 4,13,239 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా క్రస్ట్‌గేట్లతోపాటు ప్రధాన జలవిద్యుత్ కేంద్రం, ఎడమ, కుడి, వరద, ఎస్సెల్బీసీ కాల్వల ద్వారా అంతే మొత్తంలో నీటిని విడుదల చేస్తున్నారు. పులిచింతలలోనూ 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.


. రెండు లక్షల క్యూసెక్కులకు పైగా ఇన్‌ఫ్లో ఉన్న నారాయణపుర జలాశయానికి కూడా సాయంత్రానికి 80 వేల క్యూసెక్కులకు తగ్గింది. అయితే, ఎగువన వరద తగ్గుముఖం పట్టినప్పటికీ బేసిన్‌లో దిగువన ప్రాజెక్టులకు మరో నాలుగైదురోజుల వరకు ఇన్‌ఫ్లోలు భారీగానే ఉండే అవకాశం ఉన్నదని అధికారులు చెప్తున్నారు. గోదావరిలోనూ వరద ఉధృతి భారీగానే కొనసాగుతున్నది.శ్రీరాంసాగర్‌కు 9,850 క్యూసెక్కుల వరద వస్తుండగా.. శ్రీరాజరాజేశ్వర జలాశయం నుంచి లోయర్‌మానేరుకు జలాల తరలింపు కొనసాగుతున్నది.
 


మరింత సమాచారం తెలుసుకోండి: