చింతమనేని ప్రభాకర్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కూన రవికుమార్ ఈ ముగ్గురు నేతలు కనిపించడం లేదు. అధికారం మారిన తరువాత టిడిపి నేతలు వరుసగా కేసుల్లో ఇరుక్కుంటున్నారు. కొందరిపై కేసులు నమోదయ్యాయి, మరికొందరిపై విచారణ మొదలైంది. మరికొందరు కేసులు కోర్టుల్లో విచారణ జరుగుతున్నాయి. చింతమనేని ప్రభాకర్ పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే. టిడిపి అధికారంలో ఉండగా ఈయన దూకుడును ఎవరూ అడ్డుకోలేదు చింతమనేనిపై దాదాపు యాభై రెండు కేసులు నమోదయ్యాయి. వీటిలో పదహారు కేసులు రిజిస్టర్ చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. ఇప్పుడు ఈయన కోసం పోలీసులు వేటాడుతున్నారు.


అయితే రహస్యంగా చింతమనేని రాష్ట్రం వదిలి పారిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ లేదా గురుగావ్ లో ఆయన తలదాచుకున్నట్లు తెలుస్తుంది. అజ్ఞాతంలో ఉన్న చింతమనేని విదేశాలకు పారిపోకుండా చూడాలని ఉన్నతాధికారులను పశ్చిమ గోదావరి పోలీసులు కోరినట్లు సమాచారం. ఇటు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తప్పుడు పత్రాలు సృష్టించి వేరొకరి భూమిని తన భూమిగా అమ్మిన కేసులో సోమిరెడ్డి విచారణకు హాజరు కాకుండా డుమ్మా కొట్టారు. ఈ కేసులో ఇప్పటికే సోమిరెడ్డికి అధికారులు నోటీసులు జారీ చేశారు. సోమవారం విచారణాధికారి నెల్లూరు సీఐ రామకృష్ణ ముందు సోమిరెడ్డి హాజరు కావల్సింది,


అయితే సోమిరెడ్డి విచారణకు హాజరు కాకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు ఆయన తరఫున లాయర్లు మాత్రమే వచ్చారు. ఫోర్జరీ కేసులో పోలీసులు అరెస్టు చేస్తారేమోనన్న భయంతో సోమిరెడ్డి ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు ఆయన కనిపించకుండా పోవడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఆముదాలవలస మాజీ ఎమ్మెల్యే కూన రవి కుమార్ కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అధికారుల విధులకు ఆటంకం కలిగించారని ఆయనతో పాటు పన్నెండు మందిపై కేసు నమోదైంది.


ఇప్పటికే పన్నెండు మందిపై చార్జిషీట్ తయారు చేసి వారిని అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ విషయం తెలిసి ఏ వన్ గా ఉన్న కూన రవి కుమార్ అప్పట్నుంచీ అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇప్పటికే కూన రవి ముందస్తు బెయిల్ పిటిషన్ ను కింది కోర్టులు కొట్టివేశాయి. దీంతో హై కోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇటు కూన రవి కోసం నాలుగు పోలీసు టీం లు తీవ్రంగా వెతుకుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు టిడిపిలో కీలకంగా ఉన్న ఈ నేతలు ఇపుడు కేసులో ఇరుక్కోవడం బెయిల్ కోసం అజ్ఞాతంలోకి వెళ్లడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: