ఏపీ ప్రభుత్వం ఉగాది నాటికి 25 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు కావాల్సిన భూమిని సేకరించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిని పట్టాల కోసం రెడీ చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు చేయడంతోపాటు.. మంత్రులు జిల్లాల వారీ పర్యటనలు చేపట్టనున్నారు. అదే సమయంలో పెండింగ్ లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించి ల్యాండ్ బ్యాంక్ పెంచుకోవాలని వ్యూహం రచిస్తోంది జగన్ సర్కార్.


పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మ కంగా తీసుకుంది ఏపీ సర్కార్. మూడు నెలల పాలన కాలంలో ప్రభుత్వం తీసుకున్న కీలకనిర్ణయాల్లో ఇళ్ల పట్టాల పంపిణీ ప్రధానమైంది. గత ప్రభుత్వాల మాదిరి కాకుండా.. ఈ కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేసేందుకే కొంత టైమ్ తీసుకోవాలని సర్కార్ భావించింది. అందుకే వచ్చే ఉగాది నాటికి పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీని చేపట్టాలని డిసైడ్ అయ్యారు జగన్. అయితే ఈలోగా 25 లక్షల మందికి పంపిణీ చేయాల్సిన భూమిని గ్రామాల వారీగా సేకరించుకోవాల్సిన అవసరం ఉంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఎంతవరకు భూమి అందుబాటులో ఉందో నివేదిక సిద్దం చేయాలని కలెక్టర్లకు సూచించింది. దీంతో జిల్లా కలెక్టర్లు గ్రామాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిని గుర్తించే పనిలో ఉన్నారు. 


ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహరంలో జరుగుతున్న కార్యక్రమాల పరిశీలనకు మంత్రులు జిల్లాల పర్యటనలు చేపడుతున్నారు. డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌తో పాటు రంగనాథరాజు.. ఈనెల 17నుంచి జిల్లాల పర్యటనలు చేపడతారు. పశ్చిమ గోదావరి జిల్లాతో మొదలుపెట్టి.. అన్ని జిల్లాల్లో వరుస పర్యటనలు చేయనున్నారు మంత్రులు. ఈ క్రమంలో జిల్లాల్లో అందుబాటులో ఉన్న భూమికి సంబంధించిన వివరాలతోపాటు.. లబ్దిదారుల జాబితాను కూడా వీలైనంత వరకు సిద్దం చేసి ఉంచాలని ఆదేశించారు. ఈ క్రమంలో క్షేత్ర స్థాయిలో భూ సమీకరణకు ఎదురయ్యే సమస్యలను.. వీలుంటే అక్కడికక్కడే పరిష్కరించే దిశగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. 13 జిల్లాల్లో క్షేత్ర స్థాయి పర్యటనలు ముగించుకున్నాక.. ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి భూ లభ్యతపై సీఎంకు నివేదిక ఇవ్వనున్నారు మంత్రులు. ఒక వేళ అనుకున్న స్థాయిలో భూమి లభించనట్లైతే ప్రైవేటు భూములను కొనుగోలు చేసైనా సరే.. ఇళ్ల పట్టాల కోసం సిద్దంగా ఉంచాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించిన కసరత్తును కూడా జిల్లాల పర్యటనలో మంత్రులు పూర్తిచేయనున్నారు. 


వీలైనంత మేరకు ప్రభుత్వ భూమినే సమీకరించుకునే ప్రయత్నాలు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది సర్కార్. ఈ క్రమంలో భూములకు సంబంధించి ప్రభుత్వానికి.. వ్యక్తులకు పెండింగులో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించే దిశగా కృషి చేయాలని భావిస్తోంది. ల్యాండ్ సీలింగ్ వివాదాలకు సంబంధించిన కేసులను పరిష్కరించాలని భావిస్తోంది. ఈ కేసులు  పరిష్కారం అయితే .. పెద్ద ఎత్తున భూమి ప్రభుత్వానికి అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తోంది సర్కార్. మండపేట నియోజకవర్గంలో ల్యాండ్ సీలింగ్ వివాదాల్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తే సుమారు 300 ఎకరాల భూమి అందుబాటులోకి రానుందనే విషయం డెప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ దృష్టిలోకి వచ్చింది. ఈ క్రమంలో ఇదే తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ల్యాండ్ సీలింగ్ కేసుల ్లో ఉన్న భూ తగాదాలను పరిష్కరిస్తే పెద్ద ఎత్తున భూమి అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. దీంతో రెవెన్యూ యంత్రాంగం ల్యాండ్ సీలింగ్ కేసులకు సంబంధించిన ఫైళ్ల దుమ్ము దులపనున్నారు. ప్రార్థన మందిరాలు..ఎండోమెంట్స్ కు సంబంధించిన భూముల విషయంలో ఆచితూచి వ్యవహరించాలని అధికారులను ఆదేశిస్తున్నారు. వీటిని టచ్ చేస్తే లేనిపోని వివాదాలను ప్రభుత్వం నెత్తికెత్తికోవాల్సి వస్తుందని భావిస్తున్న సర్కార్.. వీటి విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: