ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. ప్రస్తుతం రాజకీయమంతా పల్నాడు చుట్టూనే తిరుగుతోంది. చంద్రబాబునాయుడు పిలుపునిచ్చిన 'చలో ఆత్మకూరు' కార్యక్రమం  యుధ్ద వాతావరణాన్ని తలపిస్తోంది. చంద్రబాబునాయుడును హౌస్ అరెస్ట్ చేయడంతో వివాదం తారాస్థాయికి చేరుకుంది. పోలీసు వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది.. వారిని పావులుగా వాడుకుంది.. అంటూ వ్యాఖ్యానించారు. ఇంకా చెప్పాలంటే అచ్చెన్నాయుడు వంటి నాయకులు పోలీసులను తిట్టారు కూడా. 



ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే టీడీపీ నాయకులు పోలీసులను, వైసీపీ నాయకులను, ప్రభుత్వ తీరును తప్పుపట్టడమే. ముఖ్యంగా అప్పట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్ విశాఖపట్నంలో ధర్నా కార్యక్రమానికి వస్తే కనీసం ఎయిర్ పోర్టు నుంచి బయటకు రానీయలేదు అప్పటి ప్రభుత్వం. పవన్ కల్యాణ్ విశాఖపట్నంలో ర్యాలీ నిర్వహిస్తే కనీసం మీడియా కవరేజీ కూడా ఇవ్వనీకుండా అధికారాన్ని ఉపయోగించింది. రామ్ గోపాల్ వర్మ తన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ చేసుకునేందుకు విజయవాడలో ప్రెస్ మీట్ ఏర్పాట్లు చేసుకుంటే గన్నవరం ఎయిర్ పోర్టులోనే ఆయన్ను అడ్డుకున్నారు టీడీపీ ప్రభుత్వ పెద్దలు. విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్ లో ప్రెస్ మీట్ పెట్టుకుంటానన్న ఆర్జీవీని గేట్ వే హోటల్ లో నిర్భంధించారు అదే పెద్దలు. ఇప్పుడు మాత్రం తమను బలవంతంగా అడ్డుకుంటున్నారు.. పోలీసు జులుం నశించాలి.. ప్రభుత్వం పోలీసులకు పార్టీ చొక్కాలు వేసి అధికార దుర్వనియోగానికి పాల్పడుతోంది అంటున్నారు. 



చూస్తుంటే చంద్రబాబును ఆయనింట్లో హౌస్ అరెస్ట్ చేయడమే టీడీపీకి కావలిసింది అనిపిస్తోంది. అప్పుడే కదా విపరీతమైన కవరేజ్ వచ్చి టీవీల్లో రోజంతా ప్లే చేస్తారు. ఎలాగూ వీరు చెప్పినట్టు నడుచుకునే వాళ్లకు కొదవ లేదు. దీనికి ధీటుగానే వైసీపీ కూడా స్పందిస్తోంది. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరిపైనైనా చర్యలు తీసుకోవాల్సిందే. మరి ఈ వాతావరణం ఎప్పటికి చల్లారుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: