ఉగ్రవాదం... కశ్మీర్‌ అంశంలో పొరుగు దేశమైన పాకిస్థాన్‌ పై తీరును అంతర్జాతీయ వేదికపై ఎండగట్టింది ఇండియా. యూఎన్‌ఓలో జరిగిన మానవ హక్కుల సదస్సులో పాక్‌‌ విదేశాంగ మంత్రి షా మహమూద్ చేసిన ప్రసంగంపై ఇండియా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. జమ్ము కశ్మీర్‌ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు దోహదం చేస్తాయని హోం మంత్రిత్వ శాఖ సెక్రటరీ విజయ ఠాకూర్ సింగ్ తెలిపారు. భారతదేశ అంతర్గత వ్యవహారంలో ప్రపంచంలోని ఏ ఇతర దేశం జోక్యం అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. 


జమ్ము కశ్మీర్‌ అంశంపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి సదస్సులో పాక్‌ చేసిన ఆరోపణలకు భారత్‌ ధీటుగా సమాధానం ఇచ్చింది. అంతర్జాతీయ ఉగ్రవాదానికి కేంద్రంగా ఎవరు ఉన్నారో యావత్ ప్రపంచానికి తెలుసునని ఇండియా స్పష్టం చేసింది. అలాంటి వాళ్లే ఇప్పుడు జమ్మూకశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ భారత్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని పాక్ తీరును భారత్ ఎండగట్టింది. యూఎన్‌హెచ్ఆర్‌సీలో భారత్ తరఫున హోం మంత్రిత్వ శాఖ సెక్రటరీ విజయ ఠాకూర్ సింగ్ మాట్లాడారు.


జమ్ముకశ్మీర్‌ అంతర్జాతీయ అంశమనీ.. భారత అంతర్గత వ్యవహారం కాదని పాక్ విదేశాంగ శాఖ మంత్రి షా మహమూద్ ఖురేషి తన ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలను విజయ్‌ ఠాకూర్ సింగ్ తోసిపుచ్చారు. భారత ప్రభుత్వం తీసుకున్న సార్వభౌమాధికార నిర్ణయాలు పూర్తిగా తమ దేశ అంతర్గత వ్యవహారమని ఆమె కుండబద్దలు కొట్టారు. పార్లమెంటులో ఆమోదించిన ఇతర నిర్ణయాల తరహాలోనే కశ్మీర్ విషయంలో పార్లమెంట్ తీసుకున్న నిర్ణయం పూర్తిగా భారతదేశ అంతర్గత వ్యవహారమని, వాటిలో ఏ దేశం ప్రమేయాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.


కశ్మీర్‌లో అభివృద్ధిపరమైన విధానాలను పూర్తిగా అమలు చేయనున్నామని ఠాకూర్ సింగ్ చెప్పారు. కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయంటూ పాక్ పూర్తిగా తప్పుడు కథనాలు, కట్టుకథలు ప్రచారం చేస్తోందని తెలిపారు. అంతర్జాతీయ ఉగ్రవాదానికి ఎవరు కేంద్ర స్థానంగా నిలుస్తున్నారో, ఉగ్రవాదులకు ఆశ్రయం, నిధులు ఎవరు అందిస్తున్నారో ప్రపంచం మొత్తానికి తెలుసునని పాక్‌ తీరును ఈ సందర్భంగా ఠాకూర్ సింగ్ ఎండగట్టారు. ఇటీవల తీసుకున్న శానసపరమైన చర్యలతో జమ్ముకశ్మీర్, లడఖ్‌లలో ప్రగతిశీల పథకాలు అమల్లోకి వస్తాయని ఠాకూర్ సింగ్ తెలిపారు. లింగ వివక్షకు తెరపడుతుందని, బాలల హక్కులకు మెరుగైన రక్షణ లభిస్తుందని, విద్య, సమాచార హక్కులకు భరోసా ఉంటుందని వివరణ ఇచ్చారు. సామాజిక-ఆర్థిక సమానత్వం, సమన్యాయానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందనీ.. కట్టుదిట్టమైన ప్రగతిశీల విధానాలు అమలు చేస్తోందని ఠాకూర్ సింగ్ స్పష్టం చేశారు. ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా.. అమలు చేసినా.. అవి పూర్తిగా భారతీయ చట్టాలు, ప్రజాస్వామ్య సంప్రదాయాలకు అనుగుణంగా ఉంటాయని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిలో భారత్ తేల్చిచెప్పింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: