చాలా మంది నటీనటులు లాగే ఆమె కూడా రాజకీయాల్లోకి చేరింది. రెండు దశాబ్దాలకు పైగా సినీరంగంలో ఉన్న ఆమెకు పాలిటిక్స్ లో మాత్రం కేవలం ఐదు నెలలే మనగలిగింది. నా వల్ల కాదంటూ రాజీనామా చేసేసింది. ఇది సినీనటి ఊర్మిళా మతోంద్కర్ పరిస్థితి. గత మార్చిలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు, ఊర్మిళ లోక్ సభ ఎన్నికల్లో ముంబై నార్త్ నియోజక వర్గం నుంచి పోటీ చేశారు, అయితే బిజెపి అభ్యర్థి చేతిలో ఓటమిపాలయ్యారు.


తన ఓటమికి సంజయ్ నిరుపమ్ కు సన్నిహితులైన ఇద్దరు స్థానిక నేతలే కారణమని అప్పట్లో ఆరోపించారు ఊర్మిళ.ఈ మేరకు ఆమె అధినాయకత్వానికి లేఖ రాశారు, అయితే ఆ వివాదానికి ఎలాంటి పరిష్కారం లభించకపోయినా ఊర్మిళ రాసిన లేఖ మీడియాకు లీకవ్వడం అప్పట్లో ఊర్మిళతో పాటు కాంగ్రెస్ అధినాయకత్వాన్ని ఇబ్బంది పెట్టింది. తాజాగా పార్టీకి గుడ్ బై చెబుతూ ఊర్మిళ రాసిన లేఖ ఇప్పుడు ముంబై కాంగ్రెస్ లో అగ్గి రాజేసింది.


పార్టీని బలోపేతం చేయడానికి కీలక నాయకులు శ్రద్ధ చూపటం లేదని వ్యాఖ్యానించారు ఊర్మిళ. లోకసభ ఎన్నికల్లో తమ ఓటమిపై అప్పటి ముంబై కాంగ్రెస్ అధ్యక్షుడు మిలింద్ దేవరా రాసిన లేఖ లీక్ కావడం దారుణమన్నారు. రహస్యంగా ఉంచాల్సిన అంశం మీడియాకు చేరడం తనను ఇబ్బంది పెట్టిందన్నారు ఊర్మిళ.అయితే ఆ విషయాన్ని పట్టించుకునే నాథుడే పార్టీలో లేడని వ్యాఖ్యానించారు ఆమె. అంతేకాదు తాను ఆరోపణలు చేసిన సంజయ్ నిరుపమ్ కే ముంబై కాంగ్రెస్ అధ్యక్ష పదవి కట్టబెట్టారంటూ వాపోయారు.


ఇంతకంటే దారుణం మరొకటి ఉండదు అంటూ తన లేఖలో ప్రస్తావించారు ఊర్మిళ. తమ స్వార్థ ప్రయోజనాలు పార్టీలో అంతర్గత రాజకీయాల కోసం కొందరు తనను ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. దీనికి తన రాజకీయ సామాజిక భావాలు అంగీకరించటం లేదని వివరించారు. అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు ఆమె.పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఊర్మిళ ప్రకటించిన గంటల వ్యవధిలోనే ముంబై కాంగ్రెస్ అధ్యక్షుడు సంజయ్ నిరుపమ్ పై విమర్శలతో విరుచుకుపడ్డారు సీనియర్ కాంగ్రెస్ నేత మిలింద్ దేవరా. లోక్ సభ బరిలోకి దిగిన ఊర్మిళకు అప్పటి ముంబై కాంగ్రెస్ అధ్యక్షుడుగా తను పూర్తిగా సహాయ సహకారాలు అందించినట్లు తెలిపారు దేవరా.


ఊర్మిళను పార్టీలోకి తీసుకొచ్చిన సంజయ్ నిరుపమ్ ఏ ఆమె ఓటమికి కారణమని ఆరోపించారు. మొత్తానికి ఊర్మిళ రాజీనామా లేఖతో ఇప్పుడు ముంబై కాంగ్రెస్ లోని కీలక నేతలైన సంజయ్ నిరుపమ్, మిలింద్ దేవరాల మధ్య అగాధాన్ని మరింత పెంచింది. మున్ముందు ఇది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: