మోస్ట్‌ వాంటెట్‌ లష్కరే టెర్రరిస్ట్‌ ఆసిఫ్‌ను భద్రతా బలగాలు ముట్టుబెట్టాయి. 30 నెలల చిన్నారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన ఆ దుర్మార్గుడిపై.. సైన్యం రోజుల్లోనే ప్రతీకారం తీర్చుకుంది. ఈ టెర్రరిస్ట్‌ మరణంతో లష్కరేకి పెద్ద దెబ్బ తగిలింది.


సోపార్‌ జిల్లాలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. భారత సైనికులు ముగ్గురు లష్కరే ఉగ్రవాదులను హతమార్చారు. చనిపోయిన వారిలో లష్కరే కమాండర్‌  ఆసిఫ్‌ ఉన్నాడు. ఈ దుర్మార్గుడు చేయని నేరాలు లేవు. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత ఓ పండ్ల వ్యాపారి కుటుంబంపై ఉగ్రమూకలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో 30 నెలల చిన్నారి ఉన్నాడు. చిన్నారి అని చూడకుండా ఆ దుండుగుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు.


ఉగ్రవాదులు సరిహద్దులోకి ప్రవేశించారనే సమాచారంతో భద్రతను కట్టుదిట్టం చేసింది సైన్యం. తనీఖీల్లో భాగంగా ఆసిఫ్‌ ఓ కారులో ప్రయాణిస్తుండగా చెక్‌పోస్టు వద్ద పోలీసులు అడ్డుకొనే ప్రయత్నం చేశారు. అయితే అతను కారు ఆపకుండా దూసుకెళ్లాడు. దీంతో బలగాలు అతన్ని వెంబడించడంతో వారిపై ఆసిఫ్‌ ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడు. వాటిని తిప్పికొట్టే ప్రయత్నంలో భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు ప్రారంభించారు. దీంతో ఆసిఫ్‌ ఘటనా స్థలంలోనే మరణించాడు.


కశ్మీర్‌పై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పాక్‌ ఏదో విధంగా భారత్‌పై ప్రతీకారం తీర్చుకోవాలనే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో సరిహద్దుల్లోకి భారీ సంఖ్యలో ఉగ్రవాదులను తరలించింది. వారు భారత్‌లోకి చొరబడేందుకు యత్నిస్తున్నట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాలకు సమాచారం అందింది. ఈ సమయంలో లష్కరేలో కీలకంగా వ్యవహరిస్తున్న ఆసిఫ్‌ ఎన్‌కౌంటర్‌.. ఉగ్రమూకలకు పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పాలి. మొత్తానికి ఓ నరరూప రాక్షసుడు మన జవాన్ల చేతిలో హతమయ్యాడు. ఏ పాపం తెలియని చిన్నారిని హతమార్చిన ఆ మానవ మృగం గాల్లో కలిసిపోయాడు. ఇది ఉగ్రవాదులకు ఓ హెచ్చరిక. 

మరింత సమాచారం తెలుసుకోండి: