ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్...రాజ్యాంగ బద్దమైన పదవి. కేబినెట్ హోదా ఉంటుంది. ఇది ప్రతిపక్షంలో ఉండే ఓ ఎమ్మెల్యేకి దక్కుతుంది. అలాంటి పదవి కోసం టీడీపీలో చాలామంది నేతలు పోటీపడిన చంద్రబాబు మాత్రం ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కు కట్టబెట్టారు. గతంలో పయ్యావులకు ఈ పదవి చేసిన అనుభవం ఉండటం, రాజకీయం మంచి సబ్జెక్ట్ ఉండటం, మంచి వక్త  కావడంతో పయ్యావులకు పదవి ఇచ్చారు. అయితే ఇంత కీలకమైన పదవిని తీసుకుని కూడా పయ్యావులు సైలెంట్ అయిపోయారనిపిస్తోంది.


అసెంబ్లీలో తన వాక్చాతుర్యంతో అందరి మన్ననలు పొందిన పయ్యావుల తర్వాత అడ్రెస్ లేరు. ఒకవైపు టీడీపీ నేతలు, చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వం చేపడుతున్న విధానాలని తప్పుపడుతూ ఫైర్ అవుతున్నారు. పోలవరంలో రివర్స్ టెండరింగ్ కు వెళ్ళడం గానీ, బందరు పోర్టు కాంట్రాక్ట్ రద్దు గానీ తదితర అంశాలపై జగన్ ప్రభుత్వాన్ని తప్పుబడుతున్నారు.


ఇలాంటి తరుణంలో పయ్యావుల పదవిని అండగా చేసుకుని జగన్ ప్రభుత్వాన్ని ఇంకా ఇరుకున పెట్టే ప్రయత్నం చేయాలి. కానీ పయ్యావుల అలాంటి పని ఏం చేస్తున్నట్లు కనిపించడం లేదు. అసలు ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్ అంటే ప్ర‌భుత్వం చేసే ఖ‌ర్చులు, వివిధ ప్రాజెక్టుల వివ‌రాలు, బ‌డ్జెట్ కేటాయింపుల‌పై నిశితంగా ప‌రిశీల‌న చేసి త‌ప్పు ఒప్పుల‌ను ఎంచే అత్యంత కీల‌క‌మైన ప‌ద‌వి. అలాంటి పదవి చేతిలో పెట్టుకుని పయ్యావుల ఏం చేయలేకపోతున్నారు.


అయితే పయ్యావుల సైలెంట్ గా ఉండిపోవడానికి పెద్ద కారణమే ఉంది. కమిటీ ఛైర్మ‌న్‌ను నియమించినా...కీల‌క‌మైన స‌భ్యుల‌ను ఇప్ప‌టికీ ప్ర‌క‌టించ‌లేదు. దీంతో ఆయ‌న ఏమీ చేయ‌లేక పోతున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. కాకపోతే ఈ విషయంపై ప‌య్యావుల చొర‌వ తీసుకుని ప్ర‌జాప‌ద్దుల క‌మిటీని ఏర్పాటు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేయొచ్చు. అవసరమైతే గవర్నర్ దృష్టికి తీసుకెళ్లి కమిటీ ఏర్పాటుకు కృషి చేయొచ్చు.


కానీ అలాంటి ప్రయత్నాలు ఏవి పయ్యావుల చేసినట్లు కనపడలేదు. పైగా ఆయన ప్రతిపక్ష ఎమ్మెల్యే కావడంతో నియోజకవర్గంలో చెల్లుబాటు అయ్యే పరిస్తితి కనపడట్లేదు. అలాగే చాలామంది టీడీపీ కేడర్ వైసీపీలోకి వెళుతున్న...కనీసం పయ్యావుల ఆపే ప్రయత్నం చేయట్లేదు. దీంతో పయ్యావుల తీరు టీడీపీలో చర్చనీయాంశమైంది. పయ్యావుల ఇలా ఎందుకు ఉంటున్నారో అర్ధం కానీ పరిస్తితి నెలకొంది. మరి చూడాలి కమిటీ సభ్యులని ప్రకటించాకైనా పయ్యావుల యాక్టివ్ అవుతారేమో.


మరింత సమాచారం తెలుసుకోండి: