ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల కోణంలో అధ్యయనం చేసి ఎండగడదామని కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత భట్టి విక్రమార్క మల్లు టీపీసీసీ  సబ్ కమిటీ కన్వీనర్లకు పిలుపునిచ్చారు. ఈ విషయంలో శాఖల వారీగా నిర్దిష్ట సమాచారాన్ని సేకరించాలని సూచించారు. టీఆరెస్  ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజలకు చేస్తున్న మోసాన్ని అసెంబ్లీ వేదికగా  బట్టబైలు  చేద్దామన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధులతో శాఖల వారీగా ఏర్పాటు అయిన కన్వీనర్ లతో సమావేశాన్ని నిర్వహించారు. సీఎల్పీ కార్యాలయంలో బుధవారం జరిగిన ఈ సమావేశంలో భట్టి మాట్లాడారు.


ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా కన్వీనర్ లనుద్దేశించి కాంగ్రెస్ సభ పక్ష నేత  భట్టి  పలు సూచనలు చేశారు. గత ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ  ఇచ్చిన హామీలు, అధికారంలోకి వచ్చిన తరువాత చేసిన మోసాలను వెలుగులోకి తేవాలన్నారు. ముఖ్యంగా శాఖల వారీగా లోతుగా, నిర్దిష్టంగా అధ్యయనం చేయాలని సూచించారు. ఆర్థిక మాంద్యం పేరుతో ప్రజలను మభ్యపెట్టి మోసం చేయాలనే యోచనలో ఉన్నారని విమర్శించారు. దుర్మార్గపు ఎత్తుగడతో ఉన్న సీఎం కేసీఆర్ ప్రజావ్యతిరేక విధానాలను  ప్రజల ముందుకు తీసుకెళ్లాలన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన రైతు రుణమాఫీ,  రైతు బంధు పథకం హామీలను  నెరవేర్చాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. 




అదేవిధంగా రైతులకు సకాలంలో యూరియాను కూడా   అందించలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు. శాఖల వారీగా, అంశాల వారీగా లోతుగా, అప్రమత్తంగా గణాంకాలను  సేకరించాలని సూచించారు. ఆ  సమాచారం ఆధారంగా అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీద్దామని అయన సూచించారు. అసెంబ్లీలో చర్చ సందర్భంగా అందుబాటులో ఉండాలని కోరారు. ఈ సమావేశంలో టీపీసీసీ మీడియా ఇంచార్జ్ మల్లు రవి, కో ఆర్డినేటర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి, ముఖ్య నేతలు అద్దంకి దయాకర్, కమలాకర్ రావు, శ్యామ్ మోహన్, బెల్లయ్య నాయక్, మానవతా రాయ్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఇందిరా శోభన్ తదితరులు పాల్గొన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: