మంత్రి పదవి....ఏ నేతకైనా చిరకాల స్వప్నం లాంటిది. ఆ స్వప్నాన్ని సాకారం చేసుకోవడం కోసం అనేక రకాలుగా కష్టపడుతుంటారు. పార్టీ అధిష్టానాల వద్దా లాబీయింగ్ చేస్తుంటారు. తాను మంత్రి పదవికి అర్హుడనని చెప్పుకునే ప్రయత్నం చేస్తుంటారు. అలాగే మరికొందరు పదవి కోసం సొంత పార్టీని కాదని అధికార పార్టీలోకి కూడా జంప్ అయిపోతుంటారు. కానీ ఎంత కష్టపడినా...ప్రయత్నాలు చేసినా మంత్రి పదవి దక్కకపోతే ఆ నేత నిరాశ ఇంతా అంతా కాదు. పరువు పోయినట్లు ఫీల్ అయ్యి...అసంతృప్తికి గురవవుతాడు. సరిగా ఇలాంటి కార్యక్రమమే తెలంగాణ రాజకీయాల్లో చోటు చేసుకుంది.


ఇటీవల కాలంలో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల అభివృద్ధి పేరుతో అధికార టీఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే. అయితే వీళ్ళలో ఎక్కువమంది ఏదొక పదవి ఆశించే పార్టీలోకి వెళ్లారు. అందులో ముఖ్యంగా సీనియర్ నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి లాంటి నేత మంత్రి పదవి ఆశించే వెళ్లారు. అందుకు తగ్గట్టుగానే ఆమెకు మంత్రి పదవి దక్కింది. అలాగే అసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కూడా టీఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే. అయితే ఈయన కూడా మంత్రి వస్తుందని చాలా ఆశలు పెట్టుకున్నారు.


అందుకే ఎక్కువ మైలేజ్ వస్తుందని తనతో పాటు రేగా కాంతారావును సైతం టీఆర్ఎస్‌లో చేర్పించారు. కేబినెట్ విస్తరణలో తనకు అవకాశం దక్కుతుందని చాలా కలలు కన్నారు. అటు ఆత్రంకు కేబినెట్‌ బెర్త్ ఖాయమన్న ప్రచారం కూడా జిల్లాలో జోరుగా సాగింది. పైగా రాష్ట్రంలో గిరిజన మంత్రి ఖాళీగా ఉండటంతో, తానే గిరిజన మంత్రినని అనుచరులతో ప్రచారం చేసుకున్నారట. మంత్రినైతే చాలు ఆదివాసీల పోడు భూముల సమస్యలు, మౌలిక వసతులు కల్పిస్తామని ఆదివాసీ సంఘాలకు భరోసా కూడా ఇచ్చేశారట.


కానీ ఆత్రం ఆశలు అడియాసలయ్యాయి. తాజా మంత్రి వర్గ విస్తరణలో ఆయన పేరు లేదు. ఇక మరోసారి విస్తరణ జరిగే అవకాశం కూడా లేదు. దీంతో ఆత్రం టీఆర్ఎస్ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. పైగా తన సహచరుడు రేగా కాంతరావుకు ప్రభుత్వ విప్ దక్కింది. అలాగే లంబాడీలకు చెందిన సత్యవతి రాథోడ్ కు గిరిజన శాఖ దక్కింది. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని పోరాటం చేసిన సక్కుకు, ఈ పరిణామం మరింత కుంగదీస్తోందట.


అలాగే పార్టీలో కొందరు పెద్దలు తనపై అసత్యం ప్రచార చేశారని, కమలం గూటికి చేరిపోతారని అధిష్టానానికి ఫిర్యాదులు చేశారని ఆత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. అటు ఆత్రంకు మంత్రి పదవి రాకపోవడంతో అనుచరులు కూడా ఢీలా పడిపోయారట. దీంతో కార్పొరేషన్ పదవుల్లో ప్రాధాన్యం లభిస్తుందని అనుచరులకు ఆత్రం సర్ది చెబుతున్నారట. మొత్తానికైతే మంత్రి పదవిపై ఆత్రం ఆశలు కేసీఆర్ ఇచ్చిన షాక్‌తో ఆవిరయ్యాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: