కాళేశ్వరం ప్రాజెక్టు...తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అతి తక్కువ కాలంలోనే పూర్తి చేసిన ప్రాజెక్టు. ఇటీవల ఈ ప్రాజెక్టుని కేసీఆర్ ప్రభుత్వం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ లని పిలిచి ఘనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఇంత ప్రాముఖ్యం గల ఈ ప్రాజెక్టుని చూసేందుకు తెలంగాణ ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. బస్సులు కట్టుకుని మరి ప్రాజెక్టుని చూసేందుకు వెళుతున్నారు. కానీ ఈ సందర్శన కార్యక్రమం కాస్తా టీఆర్ఎస్ సీనియర్ నేతలు కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్యల మధ్య కోల్డ్ వార్ కు దారితీసింది. కాళేశ్వరం ప్రాజెక్టుని చూడటానికి వెళ్ళే జనం మా వాళ్ళు అంటే మా వాళ్ళని చెప్పుకుంటూ..ఆదిపత్య పోరు ప్రదర్శిస్తున్నారు.


అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ఒకే సామాజికవర్గం నుంచి వచ్చి కీలక నేతలుగా ఎదిగిన ఈ ఇద్దరు మధ్య ముందు నుంచి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్తితి ఉండేది.  కడియం టీడీపీలో ఎదిగి టీఆర్ఎస్ లోకి రాగా, రాజయ్య కాంగ్రెస్ లో ఎదిగి వచ్చారు. ఇక అప్పటివరకూ శత్రువులుగా ఉన్న ఈ ఇద్దరు 2014లో తొలిసారి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఒకరి తర్వాత ఒకరు ఉప ముఖ్యమంత్రులుగా చేశారు. మొదటిగా రాజయ్య స్టేషన్ ఘనపూర్ నుంచి ఎమ్మెల్యే అయ్యి డిప్యూటీ సీఎం పదవి చేపట్టారు.


కానీ కొద్దీ కాలంలోనే అనూహ్య పరిణామాల మధ్య రాజయ్య పదవి పోగొట్టుకోవడంతో..కడియం ఎమ్మెల్సీ పదవితో డిప్యూటీ సీఎం పోస్ట్ కొట్టేశారు. ఇక 2019 ఎన్నికల్లో స్టేషన్ ఘనపూర్ సీటు కోసం ఈ ఇద్దరు నేతలు మాటల యుద్ధం కూడా చేసుకున్నారు. కానీ సిట్టింగ్ లకే సీటు అనడంతో రాజయ్య మళ్ళీ సీటు దక్కించుకుని ఎమ్మెల్యేగా గెలిచేశారు. కడియం ఎమ్మెల్సీగా ఉండిపోయారు. ఇక ఈ పరిణామాలతో ఒకే పార్టీలో ఉన్న వీరి మధ్య వైరం కొనసాగింది.  తాజాగా వీరి వైరం కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన మరింత పెరిగేలా చేసింది.


తాజాగా స్టేషన్‌ఘన్‌పూర్‌ కార్యకర్తలు బస్సుల్లో వెళ్ళీ మరీ కాళేశ్వరం ప్రాజెక్టును చూసొచ్చారు. దీంతో కాళేశ్వరం దగ్గర స్టేషన్‌ఘన్‌పూర్‌ టీఆర్ఎస్‌ కార్యకర్తల హడావుడి బాగా కనిపించింది. అయితే, ఈ కార్యకర్తలు తమవారంటే తమవారని కడియం, రాజయ్యలు క్లెయిమ్‌ చేసుకోవడం మొదలుపెట్టారట. అసలు ఇదిగో తమ బలం ఇదేనంటూ, ఇద్దరు నేతలు గొప్పలుగా పోతుండటం ఇప్పుడు నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. ఇక వీరి మాటలు విని, విస్తుపోవడం కార్యకర్తల వంతయ్యిందట. సీఎం కేసీఆర్ కలల ప్రాజెక్టు కాళేశ్వరం చూడాలని వెళ్లిన కార్యకర్తలను చూపించి, ఇది మా బలం అని చెప్పుకోవడంతో వారు ఆశ్చర్యపోతున్నారట.


ఇక ఈ ఇద్దరి వైరంతో నియోజకవర్గంలో కార్యకర్తలు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఇలా రెండు గ్రూపులు ఉండటంతో పార్టీకి నష్టం కలిగించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషుకులు భావిస్తున్నారు. వీరి వైరం వల్ల..బలపడాలని చూస్తున్న బీజేపీకి మరింత అవకాశం ఇచ్చినట్లు ఉంటుదని చెబుతున్నారు.  మొత్తానికి రాజయ్య-కడియం కోల్డ్ వార్ ని కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన మరింత పెద్దది చేసింది.  



మరింత సమాచారం తెలుసుకోండి: