బహుశా ఇది చంద్రబాబుకు తన రాజకీయ జీవితంలోనే పెద్ద అవమానంగా చెప్పుకోవచ్చేమో.. రాజకీయంగా శత్రువులు ఎన్ని విమర్శలైనా చేస్తారు..అది చాలా సహజం. ఆ విమర్శల్లో చాలా వరకూ వ్యక్తిగతంగానూ ఉంటాయి. అది కూడా అర్థం చేసుకోవచ్చు. కానీ చాలా సన్నిహితంగా మెలిగినవారు.. ఏదైనా మాట అంటే తట్టుకోవడం చాలా కష్టం..


ఇప్పుడు చంద్రబాబుకు అదే కష్టం వచ్చింది. ఆయన రాజకీయాల్లోకి తెచ్చిన ఓ వ్యక్తి ఇప్పుడు ఏకంగా చంద్రబాబునే నీకంత సీన్ లేదు పోవయ్యా అంటున్నాడు.. అంతేనా.. ఆఫ్ట్రాల్ నువ్వొక ఎమ్మెల్యేవి అంతే.. అని మరీ గుర్తు చేస్తున్నాడు. పాపం.. అధికారం చేజారితే పరిస్థితి మరీ ఇంత భయంకరంగా ఉంటుందా అని చంద్రబాబుకు తొలిసారి అనుభవంలోకి వస్తుందనుకుంటా.


ఇంతకీ చంద్రబాబును అంతగా హర్ట్ చేసిన వ్యక్తి ఎవరో తెలుసా.. సుజనా చౌదరి. ఓ వ్యాపారిని, ఓపారిశ్రామికవేత్తను రాజకీయ నాయకుడిగా చంద్రబాబు చేశాడు. పార్టీలో విమర్శలు వచ్చినా ఎంపీని చేశాడు. అంతేనా.. మోడీకి చెప్పి ఏకంగా కేంద్ర మంత్రిని చేసేశాడు.. పాపం ఇప్పుడు అదే సుజనా చౌదరి బీజేపీలోకి వెళ్లిన తర్వాత.. కృతజ్ఞత కూడా లేకుండా చంద్రబాబును కరివేపాకులా తీసిపారేస్తున్నారు.


విజయవాడలో సుజనా ప్రెస్ మీట్ పెట్టారు. అందులో ఓ విలేఖరి.. అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. మూడేళ్లలో జమిలి ఎన్నికలు వచ్చే అవకాశముందంటూ చంద్రబాబు నాయుడు ఎలా చెప్తారంటూ సుజనా చౌదరి ప్రశ్నించారు. అంతవరకూ అంటే బాగానే ఉండేది.. కానీ.. జమిలి ఎన్నికలపై మాట్లాడే స్థాయిలో చంద్రబాబు లేదంటూ సుజనా కౌంటర్లు వేసారు. ప్రస్తుతం చంద్రబాబు కేవలం ఎమ్మెల్యే మాత్రమేనని సుజనా చౌదరి గుర్తు చేశారు. జమిలి ఎన్నికలపై తనకు సమాచారం లేదన్నారు సుజనా చౌదరి. చంద్రబాబుకు సుజనా చౌదరి ఇచ్చిన జలక్ చూసి తెలుగు దేశం నేతలు ముక్కున వేలేసుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: