ఒకప్పుడు ఎన్టీఆర్ ఎదుర్కొన్న పరిస్థితిని ఇప్పుడు కేసీఆర్ ఎదుర్కోబోతున్నారా.. సరిగ్గా 19 ఏళ్ల క్రితం జరిగిన తెలుగు రాజకీయాలు మరోసారి రిపీటవుతాయా.. అవుతాయంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేత, సినీ నటి విజయశాంతి.. తెలంగాణ రాష్ట్ర సమితిలో ఇటీవల వరుసగా తలెత్తుతున్న అసమ్మతి స్వరాల వినిపిస్తున్న సమయంలో సినీనటి విజయశాంతి ఈ కామెంట్లు చేయడం విశేషం.


సరిగ్గా 19 ఏళ్ల క్రితం చంద్రబాబు ఇదే ఎదుర్కున్నారని విజయ శాంతి అంటున్నారు. అప్పట్లో సీఎంగా ఉన్న చంద్రబాబు తన మంత్రివర్గాన్ని విస్తరించిన తర్వాత తలెత్తిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పటి వరకు తనకు తిరుగులేదని అనుకున్న చంద్రబాబుకు అప్పట్లో జరిగిన మంత్రివర్గ విస్తరణ తర్వాత గడ్డు రోజులు ప్రారంభమయ్యాయని విజయశాంతి గుర్తు చేసారు.


అప్పటి మంత్రి వర్గ విస్తరణలో చంద్రబాబు కేసీఆర్ కు మంత్రి గా అవకాశం ఇవ్వలేదు. కేవలం డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చి సరిపుచ్చారు. దీంతో కేసీఆర్ అహం దెబ్బతిన్నది. తీవ్ర రాజకీయ మథనం తర్వాత ఆయన ప్రత్యేక తెలంగాణ నినాదాన్ని అందుకున్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసినవే. చివరకు అదే టీఆర్ఎస్ ఈరోజు తెలంగాణలో టీడీపీ అనే పార్టీనే లేకుండా చేసేస్తోంది.


ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి కూడా అప్పటి చంద్రబాబులాగనే ఉందని విజయశాంతి అంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలను చూస్తున్నవారందరికీ కూడా గతంలో చంద్రబాబుకు ఎదురైన అనుభవమే ఇప్పుడు కేసీఆర్ కు కూడా ఎదురవుతుందన్న అభిప్రాయం కలుగుతోందని ఆమె అన్నారు. మొదటి నుంచి టీఆర్ఎస్ ను అంటి పెట్టుకున్న తమను విస్మరించారని ఇప్పుడు చాలా మంది సీనియర్ నేతలు భావిస్తున్న విషయాన్ని ఆమె ప్రస్తావించారు.


మరోవైపు పదవుల కోసం పార్టీ మారినా కూడా తమను పట్టించుకోలేదనే అసహనం కొందరు టీఆర్ఎస్ నేతల్లో ఉందని.. దానివల్ల కేసీఆర్ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారిందని విజయశాంతి ఎద్దేవా చేశారు. తన మాటే శాసనం అనుకున్న కేసీఆర్ కు వ్యతిరేకంగా ధిక్కార స్వరాలను వినిపించేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలు ఏ మాత్రం వెనుకంజ వేయడం లేదని ఆమె గుర్తు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: