ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ కి మళ్ళీ జవసత్వాలు నింపాలని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఒకవైపు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటే , తమ్ముళ్లు మాత్రం తమ రాజకీయ భవిష్యత్తు ను వెతుక్కుంటూ పక్క పార్టీల వైపు చూస్తున్నారు . ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు , మాజీ ఎమ్మెల్యేలు కేంద్రం లో అధికారం లో ఉన్న బీజేపీ లో చేరగా, తాజాగా    మాజీ మంత్రి నారాయణ రెడ్డి కూడా టీడీపీ కి  గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది.  గురువారం ఆయన,  బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారని  సమాచారం.  ఇప్పటికే తన అనుచరులతో కలిసి  ఆదినారాయణ రెడ్డి ఢిల్లీకి బయల్దేరి వెళ్లినట్లు తెలుస్తోంది. 


గత కొన్ని రోజులుగా ఆదినారాయణ రెడ్డి పార్టీ మారుతారంటూ  ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.  అయినప్పటికీ ఆదినారాయణరెడ్డి వాటిని ఖండించేందుకు  ఏమాత్రం ఇష్టపడలేదు.  ఆంధ్రప్రదేశ్ లో  బలపడాలని చూస్తున్నా బిజెపి నాయకత్వం,  తెలుగుదేశం పార్టీకి చెందిన అసంతృప్త  నేతలపై గురిపెట్టింది.  ఒక్కొక్కరిగా వారిని తమ  పార్టీలో  చేర్చుకున్న బిజెపి నాయకత్వం,  ఇక ఇప్పుడు మాజీ మంత్రుల పై ఫోకస్ చేసినట్లు కన్పిస్తోంది . దానిలో భాగంగా ఇన్నాళ్లు ఆదినారాయణ రెడ్డి ని చేర్చుకునేందుకు వెనుక , ముందు ఆలోచించిన బీజేపీ జాతీయ నాయకత్వం తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది .


  2004 లో జరిగిన ఎన్నికల్లో జమ్మలమడుగు అసెంబ్లీ స్థానం  నుంచి ఆదినారాయణ రెడ్డి తొలిసారిగా ఎమ్మెల్యేగా  గెలుపొందారు . అనంతరం వైకాపా లో  చేరి  2014లో మళ్ళీ జమ్మలమడుగు నుంచి రెండవసారి  ఎమ్మెల్యేగా విజయం సాధించారు .   వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డితో తలెత్తిన విభేదాల కారణంగా ఆ పార్టీని వీడి టీడీపీలో చేరి చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రి పదవి సంపాదించారు.  అయితే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జమ్మలమడుగు అసెంబ్లీ స్థానాన్ని రామసుబ్బారెడ్డి కేటాయించడంతో ఆదినారాయణ రెడ్డి కడప ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు . ఎన్నికల ఫలితాల అనంతరం పార్టీ కార్యక్రమాల పట్ల అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్న ఆదినారాయణ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయమనే ప్రచారం గత కొన్ని రోజులుగా జరుగుతోంది .


మరింత సమాచారం తెలుసుకోండి: