తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కనుసన్నల్లోనే ఆ పార్టీ నేతలు బీజేపీలో చేరుతున్నారా ? అంటే మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి చెబుతోన్న  సమాధానాన్ని పరిశీలిస్తే అవుననే అనిపించకమానదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు .  తాను చంద్రబాబు నాయుడు ని కలిసిన మాట నిజమేనన్న ఆదినారాయణ రెడ్డి ,   తాను టిడిపిలో కొనసాగలేనని అందుకే బీజేపీలో చేరుతానని ఆయనతో చెప్పినట్లు వెల్లడించారు . అంటే చంద్రబాబు అనుమతి తీసుకొనే ఆదినారాయణ రెడ్డి, తాను బీజేపీ లో చేరుతున్నట్లు చెప్పకనే చెప్పారు . గతం లోను   టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరడం, చంద్రబాబు కనుసన్నల్లోనే ఈ చేరికలు జరిగాయన్న ఆరోపణలు వినిపించాయి.


 చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితులైన కేంద్ర మాజీ మంత్రి  సుజనా చౌదరి, సిఎం రమేష్,  గరికపాటి మోహన్ రావు వంటివారు పార్టీని వీడి బీజేపీలో చేరడం ఏమిటన్న అనుమానాలు ఆ పార్టీ కార్యకర్తల్లోను వ్యక్తమయ్యాయి . అలాగే అనంతరపురం మాజీ  ఎమ్మెల్యే సూరి సైతం బీజేపీ లో చేరడం వెనుక బాబు ప్రమేయం  ఉండే ఉంటుందన్న చర్చ కూడా  రాజకీయ వర్గాల్లో కొనసాగిన విషయం తెల్సిందే . ఎందుకంటే సూరి , టీడీపీ ప్రభుత్వ హయం లో వందల కోట్ల రూపాయల కాంట్రాక్టు పనులు చేపట్టాడు . వాటిలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలు విన్పించాయి .


వైకాపా ప్రభుత్వం , ఆ అక్రమాలను తిరగదోడే అవకాశాలు ఉన్నాయని భావించే సూరి బీజేపీ లో చేరారన్న వాదనలు ఉన్నాయి .    ఆంధ్రప్రదేశ్ లో వైకాపా ప్రభుత్వం  ఉన్నన్ని రోజులు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి లో తలదాచుకొని తిరిగి ఎన్నికల సమయానికి టిడిపిలో చేరే విధంగా, ఆ పార్టీ నేతలు బీజేపీ లో చేరే లా చంద్రబాబే ప్రోత్సహిస్తున్నారన్న  అనుమానాలు రాజకీయ వర్గాల్లో  వ్యక్తం అవుతున్నాయి .


మరింత సమాచారం తెలుసుకోండి: