ఐఐటీలు అంటేనే సృజనాత్మకతకు కొత్త ఆవిష్కరణలు నిలయాలు.. ఈ సంస్థల నుంచి బయటకు వచ్చే నవ యువకులు ఎన్నో వినూత్న ఆవిష్కరణలతో చరిత్రలు సృష్టిస్తుంటారు. అలాంటి వారికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఓ సవాల్ విసిరారు. రోజు వారీ అవసరాల కోసం వాడుతున్న ప్లాస్టిక్ వస్తువులకు చౌక అయిన ఆల్టర్ నేటివ్ కనిపెట్టాలని కోరారు. పర్యావరణానికి, పశువులకు ముప్పుగా పరిణమిస్తున్న ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా చౌకైన వస్తువులు కనిపెట్టాలని కోరారు.


ఇటీవల కాలంలో పశువులు నగరాల్లో తినడానికి మేత లేక ప్లాస్టిక్ కవర్లను తింటున్న విషయంపై ఎన్నో వార్తలు వచ్చాయి. ఆవుల కడుపులో కేజీలకు కేజీలు ప్లాస్టిక్ వ్యర్థాలు బయటపడుతున్నాయి. అందుకే దీనికి విరుగుడుగా.. పశువులకు విరివిగా పచ్చిమేత లభించేలా ప్రయోగాలు చేయాలని ప్రధాని సూచించారు. ఈ రెండు అంశాలపై సవాళ్లను స్వీకరించి, కొత్త ఆలోచనలతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.


ఉత్తర ప్రదేశ్‌లోని మథురలో ‘అంకుర సంస్థలు- భారీ సవాళ్లు’ అనే కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్ని ప్రసంగించారు. జాతీయ పశువ్యాధుల నివారణ కార్యక్రమాన్ని కూడా ఆయన శ్రీకారం చుట్టారు.

ఇంకా ప్రధాని ఏమన్నారంటే.. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయాలను కనిపెట్టాల్సిన అవసరం తక్షణం ఉంది. అలా కనిపెట్టే ప్రయోగాల కోసం ప్రభుత్వం పెట్టుబడులు పెడుతుంది. ఒక్కసారి వాడిపారేసే ప్లాస్టిక్‌ను తిని పశువులు చనిపోతున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాల ద్వారా నీటి వనరులు కూడా కలుషితం అవుతున్నాయి. అందుకే ప్లాస్టిక్ వినియోగాన్ని సాధ్యమైనంత వరకూ తగ్గించాలి. అందుకే ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్లాస్టిక్‌ వాటర్ బాటిళ్లు ఇకపై వాడం.


దీనికి బదులు మట్టితోనూ, ఇతర లోహాలతోనూ చేసిన వాటినే వాడతాం. చెత్త నుంచి సేకరించిన ప్లాస్టిక్‌ను మళ్లీ వినియోగించడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తామంటున్నారు ప్రధాన మంత్రి. అవును మరి పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే.. ప్లాస్టిక్ ను వీలైనంత వరకూ వాడకం తగ్గించాలి.. ప్రకృతి వనరులను కాపాడుకోవాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: