మంత్రి వర్గ విస్తరణ తర్వాత చెలరేగిన అసంతృప్తిని చల్లార్చేందుకు టిఆర్ఎస్ అధిష్టానం ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే అసంతృప్త నేతలతో పార్టీ పెద్దలు మాట్లాడారు. మరికొందరితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు, త్వరలోనే అసమ్మతి పూర్తిగా చల్లారుతుందని విశ్వాసంతో గులాబీ అధిష్టానం ఉంది. మీడియాతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతలకు సూచనలు జారీ చేశారు. ఇక పై మీడియా చిట్ చాట్ ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.



టిఆర్ఎస్ లో ఇటీవల ముచ్చట్లు చాలా కలకలాన్ని రేపాయి. మాజీ మంత్రులు నాయిని నుంచి చాలా మంది నేతలు చిట్ చాట్ లతో తమ మనసులో మాటను బయటపెట్టారు. నేతలు కామెంట్స్ పై పార్టీలోనే కాదు మీడియాలో తీవ్ర చర్చ నడిచింది, బాల్క సుమన్ పువ్వాడ అజయ్ మధ్య జరిగిన సంభాషణ కూడా వైరలైంది. దీనితో అప్పట్నుంచీ నేతలు చిట్ చాట్ లకు దూరంగా ఉండాలని పార్టీ నుంచి ఆదేశాలు వెళ్లాయి. శాసన మండలి చైర్మన్ ఎన్నిక సందర్భంగా మంత్రులు, నేతలు హాజరయ్యారు. మీడియా చిట్ చాట్ లకు దూరంగానే ఉన్నారు. ఏం మాట్లాడితే ఏమవుతుందనే ఆందోళన నేతల్లో కనిపించింది. మరోవైపు ఇప్పటికే చిట్ చాట్ లతో అసంతృప్తిని వెళ్లగక్కిన నేతలు డ్యామేజ్ కంట్రోల్ చేసుకునే పనిలో పడ్డారు.



నాయిని నర్సింహారెడ్డి లాంటి నేతలైతే తాను ఒకటి మాట్లాడితే వీరు మరొకటి రాస్తున్నారంటూ సర్దిచెప్పుకునే ప్రయత్నం చేశారు. అంతకుముందు మండలిలో కెటిఆర్ ని నాయిని కలిశారు. దీంతో వెంటనే ఆయన వాయిస్ కూడా మారింది. ఇప్పటికే మీడియా విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్న టీఆర్ఎస్ అధిష్ఠానం ఇప్పుడు మీడియా చిట్ చాట్ ల విషయంలో కూడా నేతలకు జాగ్రత్తలు జారీ చేసింది. దీంతో అసమ్మతి నేతలు కూడా ఒక్కొక్కరు వెళ్ళి అధిష్టానాన్ని కలుస్తున్నారు. తమ పదవులు విషయాన్ని తేల్చుకుంటున్నారా, మొత్తానికి త్వరలోనే అసమ్మతి వ్యవహారం చల్లారే అవకాశం కనిపిస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: