అనుకున్నదే అయింది...తోట త్రిమూర్తులు టీడీపీని వీడటం ఖాయమైంది. ఈ నెల 18న త్రిమూర్తులు వైసీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. జగన్ సైతం త్రిమూర్తులు చేరికకు ఓకే చెప్పేశారని అంటున్నారు. త్రిమూర్తులతో పాటు మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూడా వైసీపీ తీర్ధం పుచ్చుకుంటున్నారని తెలుస్తోంది. తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీలో కీలక నాయకుడుగా వ్యవహరిస్తున్న తోట త్రిమూర్తులు..మొన్న ఎన్నికల ముందే వైసీపీలో చేరతారని ప్రచారం జరిగింది.


అయితే తనతో పాటు తన కుమారుడుకు సీటు కావాలని కండిషన్ పెట్టడంతో...జగన్ దానికి ఒప్పుకోలేదని అందుకే తోట చేరికకు బ్రేక్ పడిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. దీంతో తోట మళ్ళీ టీడీపీ తరుపున రామచంద్రాపురం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక ఓటమి పాలైన దగ్గర నుంచి తోట టీడీపీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా పాల్గొనలేదు. పైగా పార్టీకి తెలియకుండా పార్టీ కాపు నేతలతో కలిసి కాకినాడ లో సమావేశం ఏర్పాటు చేశారు.


అప్పుడే టీడీపీ అధిష్టానం కాపు నేతలనీ సరిగా పట్టించుకోలేదని విమర్శలు చేశారు. ఎన్నికల్లో కాపు నేతలకు ఆర్ధిక సాయం చేయకుండా ఓ సామాజికవర్గానికే సాయం చేశారని ఆరోపణలు చేశారు. తాజాగా అధినేత చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లా స్థాయి సమావేశం ఏర్పాటు చేసిన...ఆ కార్యక్రమానికి త్రిమూర్తులు రాలేదు. దీంతో ఆయన పార్టీ మారడం ఖాయమైందని టీడీపీ నేతలు ఫిక్స్ అయిపోయారు. అయితే త్రిమూర్తులకు బీజేపీ నుంచి కూడా ఆహ్వానం వచ్చింది. బీజేపీ నుండి జాతీయ నేత రాం మాధవ్ తో పాటుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ సైతం త్రిమూర్తులను పార్టీలోకి ఆహ్వానించారు. అయినా తోట వైసీపీ వైపే మొగ్గుచూపారు.


వైసీపీ కూడా తోటకు కీలక పదవి ఇచ్చేందుకు హామీ ఇచ్చిందని ప్రచారం జరుగుతుంది. జిల్లాలో పార్టీకి సంబంధించి కీలక బాధ్యతలు అప్పగించటంతో పాటుగా.. కొద్ది కాలం తరువాత ప్రభుత్వంలోని కీలక పదవి ఇచ్చేలా ఒప్పందం జరిగిందని సమాచారం. జగన్ కూడా అందుకు సుముఖంగానే ఉన్నారని తెలుస్తోంది. అటు త్రిమూర్తులుతో పాటు మరో ఇద్దరు కీలక నేతలు కూడా టీడీపీని వీడతారని తెలుస్తోంది. ఆ ఇద్దరు నేతల కూడా వైసీపీలోకి వెళ్లడానికి రంగం సిద్ధం చేసుకున్నారని టాక్. వీరి చేరిక కూడా జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. వీరిలో ఒక‌రు జ్యోతుల నెహ్రూ అని వార్త‌లు వ‌స్తున్నాయి. ఆయ‌న గ‌తంలో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక ఆ మూడో నేత ఎవ‌ర‌న్న‌ది వెల్ల‌డి కాక‌పోయినా ప్ర‌స్తుతం ముగ్గురు పార్టీ మారుతున్నార‌న్న వార్త బాగా వైర‌ల్ అవుతోంది. మొత్తం మీద టీడీపీలో ఒకేసారి మూడు బిగ్ వికెట్లు డౌన్ అవ్వనున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: