టీఆర్ఎస్ పార్టీకి మ‌రో ఊహించని షాక్ తగల‌నుంద‌ని తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌ అనుబంధంగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీజీబీకేఎస్‌)లో భారీ చీలిక వ‌చ్చింది. టీబీజీకేఎస్ ఆవిర్భావంలో కీలకపాత్ర పోషించిన కెంగెర్ల మల్లయ్య యూనియన్ వీడి బీజేపీకి చెందిన భారతీయ మజ్దూర్ సంఘ్‌లో చేరే అవకాశం ఉందని సమాచారం. ఈ మేర‌కు ఆయ‌న కండువా క‌ప్పుకోవ‌డ‌మే ఆల‌స్య‌మ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ ప‌రిణామం... గత అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు టీబీజీకేఎస్‌కు గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న‌ కల్వకుంట్ల కవితకు భారీ షాక్ అని అంటున్నారు.


సింగ‌రేణిలో కీల‌క‌మైన పెద్దపల్లి లోక్‌సభకు పోటీచేసే అభ్యర్థుల తలరాత మార్చే శక్తి సింగరేణి కార్మికులకు ఉంది. ఈ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో రామగుండం, మంథని, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు స్థానాల్లో సింగరేణి కార్మికులు నిర్ణయాత్మక స్థాయిలో ఉన్నారు. మంచిర్యాల జిల్లాలోని మూడు సెగ్మెంట్లలోనే 19 వేల మంది కార్మికులు ఉండగా, రామగుండం, మంథనిల్లోని ఆర్‌జీ 1,2,3 పరిధిలో కూడా అదే స్థాయిలో కార్మికులు, ఇతర స్థాయి ఉద్యోగులు ఉన్నారు. వీరి కుటుంబాలను, స్వగ్రామాల్లోని వారి బంధువులను కార్మికులు ప్రభావితం చేస్తారు. 


పెద్దపల్లితో పాటు టీఆర్‌ఎస్‌ను దెబ్బకొట్టిన లోక్‌సభ నియోజకవర్గం ఖమ్మం. ఈ నియోజకవర్గం పరిధిలోని సత్తుపల్లిలో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గెలుపొందగా , కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి గెలిచారు. మహబూబాబాద్‌ పార్లమెంటు పరిధిలోకి వచ్చే పూర్వ ఖమ్మం జిల్లాలోని ఇల్లందు, పినపాకల్లో కూడా కాంగ్రెస్‌ గెలిచింది. వరంగల్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని భూపాలపల్లి, ఆదిలాబాద్‌లోని ఆసిఫాబాద్‌ సెగ్మెంట్లలోనూ కాంగ్రెస్‌ అభ్యర్థులే గెలిచారు. 5 లోక్‌సభ నియోజకవర్గాల్లో విస్తరించిన 11 అసెంబ్లీ స్థానాల్లో సింగరేణి ఓటర్ల ప్రభావం కచ్చితంగా పడుతుందని టీఆర్‌ఎస్‌ నేతలు భావిస్తున్నారు.తాజా చీలిక టీఆర్ఎస్ పార్టీకి సైతం పెద్ద‌ దెబ్బ అని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: