ఏపీలో నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ వినిపిస్తోంది. వైఎస్ జగన్ అధికారం చేపట్టిన నాటి నుంచి నిరుద్యోగులకు పండుగలానే మారింది. కేవలం మూడు నెలల్లోనే ఆయన లక్షల సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టారు. గ్రామ సచివాలయ భావనతో లక్షల కొద్దీ ఉద్యోగాలు సృష్టించారు. ఆ తర్వాత కూడా అడపా దడపా కొత్త పోస్టుల గురించి మాట్లాడుతూనే ఉన్నారు.


తాజాగా హోంమంత్రి మేకతోటి సుచరిత ఈ గుడ్ న్యూస్ చెప్పారు. హోం శాఖలోని ఖాళీలన్నీ భర్తీ చేస్తామన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగుల కోసం త్వరలోనే భారీ రిక్రూట్‌మెంట్‌ చేపట్టి పోలీస్‌ శాఖలో ఉన్న ఖాళీలన్నింటిని భర్తీ చేస్తామని హోం మంత్రి మేకతోటి సుచరిత హామీ ఇచ్చారు. పోలీస్‌శాఖలో అమలు చేస్తున్న వీక్లీఆఫ్‌ వలన కొత్తగా పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించామని తెలిపారు. సివిల్‌, ఏఆర్‌, ఏపీఎస్పీ, జైలు వార్డన్స్‌ కానిస్టేబుళ్ల ఫలితాలను గురువారం ఆమె విడుదల చేసినట్లు వెల్లడించారు.


ఈ ఉద్యోగాలకు మొత్తం 2623 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికవగా, అందులో 500 మంది మహిళలు ఉన్నట్లు పేర్కొన్నారు. అర్హత సాధించిన అభ్యర్థులకు త్వరలోనే శిక్షణ ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. ఆ తర్వాత మంత్రి ఓ పోలీసు ఎస్సైపై టీడీపీ నేత నన్నపనేని రాజకుమారు నోరు పారేసుకున్నట్టు వచ్చిన వార్తలపైనా స్పందించారు.


దళితులను అవమానిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి మేకతోటి సుచరిత హెచ్చరించారు. విధి నిర్వహణలో భాగంగా ఎస్సైగా తన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తోన్న మహిళను నన్నపనేని రాజకుమారి కులం పేరుతో దూషించడం తగదన్నారు. టీడీపీ స్వార్థ రాజకీయాలు పల్నాడులో పని చేయలేదని విమర్శించారు. దళితుల పట్ల అమితమైన ప్రేమ కురిపిస్తోన్న చంద్రబాబు వారి ప్రభుత్వ హయాంలో ఐపీఎస్‌ అధికారిణి వనజాక్షిపై జరిగిన దాడిపై ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: