ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు జల వనరుల శాఖ అధికారులకు రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా వచ్చే నాలుగు సంవత్సరాల్లో పెండింగ్ ప్రాజెక్టుల పనులన్నీ పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. ఏ ఏడాది లోపు ఏ ప్రాజెక్టులు పూర్తి అవుతాయో ఆ ప్రాజెక్టులను ఆయా సంవత్సరాల్లో ప్రాధాన్యత ప్రాజెక్టులుగా పరిగణించి పూర్తి చేయాలని సీఎం అధికారులకు చెప్పారు. 
 
సాగునీటి ప్రాజెక్టుల విషయంలో మాత్రం భారీగా నిధులు కేటాయిస్తామని సీఎం అధికారులకు చెప్పారు. రివర్స్ టెండరింగ్ ద్వారా అవినీతిని నిర్మూలించాలని సీఎం అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రాజెక్టులను పారదర్శకంగా, శరవేగంగా పూర్తి చేయాలని ప్రతి రుపాయిని సద్వినియోగం చేసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. నీటి లభ్యత ఉంటే కొత్త ప్రాజెక్టుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు తెలిపారు. 
 
25 శాతంలోపు పూర్తయిన ప్రాజెక్టుల పనులను నిపుణుల కమిటీ సిఫారసుల ఆధారంగా చేపట్టాలని సీఎం సూచించారు. నెల్లూరు, రాయలసీమలోని ప్రాజెక్టులు నింపడానికి చాలా సమయం పడుతుందని, ఎక్కడైనా లోపాలు ఉంటే సరిచేయాలని అధికారులకు సీఎం చెప్పారు. తెలుగు గంగ ప్రాజెక్టు కాలువ లైనింగ్ పనులు పూర్తి కాకపోవటం వలనే నెల్లూరు, రాయలసీమ జిల్లాలలోని ప్రాజెక్టులకు నీటిని నింపడానికి ఎక్కువ సమయం పడుతున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. 
 
ఒడిశా అభ్యంతరాల వలన నేరడి బ్యారేజీ నిర్మాణానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, జంఝావతిపై ఒడిశా అభ్యంతరాలు వ్యక్తం చేయటంతో ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీటిని అందించలేకపోతున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. ఒడిశా సీఎంతో చర్చించి ఈ సమస్యలను పరిష్కరిస్తానని సీఎం అధికారులకు చెప్పారు. మహేంద్రతనయ ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. ఉద్దానంలో కలుషితమైన భూగర్భ జలాలను తాగటం వలనే ప్రజలు కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నారని, నదీజలాలను అందించటం ద్వారా ఈ సమస్యను పరిష్కరించాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. 


 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: