లడక్ లోని సరిహద్దు ప్రాంతంలో భారత్‌, చైనా సైన్యాలు పరస్పరం తలపడ్డాయి. లడక్ లోని ఉత్తర ప్యాంగాంగ్‌ సరస్సు సమీపంలో ఇరుదేశాల సైనికులు పరస్పరం బాహాబాహికి దిగారు. అయితే ఇరుదేశాల సైన్యం తరఫున ప్రతినిధుల స్థాయిలో చర్చలు  జరగడంతో ఇక్కడ ఉద్రిక్తత సమసిపోయింది. చర్చల అనంతరం అక్కడ యథాతథ స్థితి కొనసాగుతోంది.


సరిహద్దు వివాదం కారణంగా భారత్‌, చైనా మధ్య మరోసారి ప్రతిష్టంభన నెలకొంది. తూర్పు లడక్ లోని పాంగాంగ్‌ సో సరస్సు సమీపంలో భారత జవాన్లు పెట్రోలింగ్‌ చేస్తుండగా.. చైనా సైనికులు అడ్డుకున్నారు. టిబెట్‌-లడక్ భూభాగాల మధ్యలో ఉన్న ఈ సరస్సు మూడోవంతు చైనా అధీనంలోనే ఉంది. అయితే.. భారత భూభాగంలో ఉన్న సరస్సు వెంబడి మన జవాన్లు పెట్రోలింగ్‌ చేస్తుండగా... చైనాకు చెందిన పీపుల్‌ లిబరేషన్‌ ఆర్మీ జవాన్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో భారత ఆర్మీ జవాన్లతో ముఖాముఖి తలపడ్డారు. దీంతో ఇరు దేశాల మధ్య కొంతసేపు ప్రతిష్టంభన నెలకొంది. విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఇరుదేశాల సైన్యాలు అత్యవ‌స‌రంగా చుస‌ల్ ప్రాంతంలో బోర్డర్ ప‌ర్సన‌ల్ మీటింగ్‌ని ఏర్పాటు చేశారు. ఆ భేటీతో రెండు ద‌ళాల మ‌ధ్య నెల‌కొన్న ఘ‌ర్షణాత్మక వాతావ‌ర‌ణం చ‌ల్లబ‌డింది. వాస్తవాధీన రేఖపై విభిన్న అవగాహనల కారణంగా ఈ సమస్య తలెత్తినట్లు తెలిపాయి. వాస్తవానికి ప్యాన్‌గాంగ్ సో భాగంలో చైనా ఆధీన‌మే ఎక్కువ‌. అక్కడ ఉన్న జ‌లాల‌పై రెండు దేశాల‌కు చెందిన స్పీడ్ బోట్లు పెట్రోలింగ్ చేస్తుంటాయి.


భారత్‌, చైనా మధ్య లడక్ సరిహద్దు అంశంపై ప్రతిష్టంభన నెలకొనడం ఇదే తొలిసారి కాదు. 2017 ఆగస్టులో ఇదే విషయమై రెండు దేశాల జవాన్లు పరస్పరం దాడులు కూడా చేసుకున్నారు. అప్పట్లో ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఇదే కాకుండా అరుణాచల్‌ప్రదేశ్ సరిహద్దు అంశంలోనూ రెండు దేశాల మధ్య తరచూ వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ మధ్య డొక్లాం వివాదం తలెత్తినప్పుడు దాదాపు రెండు నెలల పాటు భారత్‌, చైనా మధ్య ప్రతిష్టంభన నెలకొనగా.. దౌత్యపరమైన చర్యలతో ఆ సమస్య  పరిష్కారమైంది.


గ‌త నెల‌లో క‌శ్మీర్‌లో ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు త‌ర్వాత భార‌త్‌, చైనా మ‌ధ్య ద్వైపాక్షిక సంబంధాలు కొంత బ‌ల‌హీన‌ప‌డ్డాయి. ల‌డక్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రక‌టించ‌డాన్ని చైనా వ్యతిరేకించింది. ఐక్యరాజ్యస‌మితిలో క‌శ్మీర్‌కు వ్యతిరేకంగా పాక్ చేప‌డుతున్న చ‌ర్యల‌కు చైనా మ‌ద్దతు కూడా ప‌లికింది. వాస్తవాధీన‌ వ‌ద్ద ఉద్రిక్త స‌హ‌జ‌మే అని, అయితే ఆ స‌మ‌స్యల‌ను ప‌రిష్కరించేందుకు బీపీఎంలు స‌మావేశం నిర్వహించిన‌ట్లు భారత ఆర్మీ చెప్పింది. మ‌రోవైపు ఈ అక్టోబ‌ర్‌లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ప్రధాని మోడీ భేటీ కానున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: