ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు వెయ్యి రుపాయలు బిల్లు దాటితే ఆ వైద్యాన్ని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తానని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం అమలు కోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నిన్న జరిగిన సమావేశంలో జరిగిన చర్చలో డెంగీ, మలేరియా జ్వరాలను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావాలని భావిస్తోంది. 
 
ఈ కమిటీ 60 రోజుల పాటు ఆస్పత్రులకు, గ్రామాలకు వెళ్లి అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసి డెంగీ, మలేరియా జ్వరాలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 161 వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావటం వలన పేద రోగులకు మేలు చేసినట్లు అవుతుందని నిపుణుల కమిటీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో 944 రకాల జబ్బులు ఉండగా మరో 1000 రకాల జబ్బులు ఈ పథకంలో చేర్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. 
 
డే కేర్ సర్వీసులను మరియు వెయ్యి రుపాయలు బిల్లు దాటే ప్రతి జబ్బును ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావాలని కమిటీ భావిస్తోంది. ఆరోగ్యశ్రీ పరిధిలో తరచుగా వచ్చే వ్యాధులను చేర్చటం ద్వారా పేదలు భారీగా లబ్ధి పొందే అవకాశం ఉందని కమిటీ భావిస్తోంది. ఆరోగ్యశ్రీ పరిధిలోకి వ్యాధులను చేర్చటం వలన 1500 కోట్ల రుపాయల అదనపు వ్యయం అవుతుందని కమిటీ అంచనా వేసింది. 
 
నిపుణుల కమిటీ అంచనాల ప్రకారం ఏపీ ప్రభుత్వం 3000 కోట్ల రుపాయలు సంవత్సరానికి ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ సమావేశంలో నిపుణులు ఆరోగ్యమిత్రల వ్యవస్థను బలోపేతం చేయాలని, ప్రస్తుతం ఉన్న ఆరోగ్యశ్రీ కార్డుల స్థానంలో కొత్త కార్డులను జారీ చేయాలని, బిల్లుల విషయంలో ఆస్పత్రులు పారదర్శకంగా వ్యవహరించటం కొరకు చర్యలు తీసుకోవాలని, ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్న ఆస్పత్రుల సంఖ్యను పెంచాలని సూచనలిచ్చినట్లు సమాచారం. కమిటీ నివేదికను వచ్చే వారం సీఎం జగన్మోహన్ రెడ్డి కి ఇవ్వబోతున్నట్లు సమాచారం. 



మరింత సమాచారం తెలుసుకోండి: