ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పబోతుంది. ఇప్పటికే రాష్ట్రంలోని నిరుద్యోగ యువత కోసం గ్రామ, వార్డ్ వాలంటీర్ల ఉద్యోగాలు మరియు 1,26,728 గ్రామ, వార్డ్ సచివాలయాలలోని శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేయబోతున్న ప్రభుత్వం 2020 సంవత్సరం జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది. డీఎస్సీ ద్వారా ఈ సంవత్సరం చివరినాటికి ఉన్న ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. 
 
2020 జనవరిలో నోటిఫికేషన్ విడుదలైన తరువాత ఏప్రిల్ లేదా మే నెలలో డీఎస్సీ రాత పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. డీఎస్సీ రాత పరీక్ష ద్వారా ఎంపికయ్యే టీచర్లకు 2020 జూన్ లో పాఠశాలలు ప్రారంభం అయ్యే లోపు నియామక ఉత్తర్వులను ప్రభుత్వం ఇస్తుందని తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఇదే విధానంలో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసే అవకాశం ఉందని సమాచారం. 
 
ప్రభుత్వ పాఠశాలలలో ఉపాధ్యాయ నియామకాలను పూర్తి చేయటం వలన ప్రభుత్వ పాఠశాలలలో అడ్మిషన్లు పెరగటంతో పాటు విద్యార్థులకు మెరుగైన బోధన లభించే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రాథమికోన్నత పాఠశాలల్లో ప్రతి 35 మంది విద్యార్థులకు ఒకరు, ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి 30 మందికి ఒకరు టీచర్ ఉండేలా ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. 
 
2018 సంవత్సరంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలయినపుడు రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం కేవలం 6 వేల పోస్టులను మాత్రమే నోటిఫై చేసిందని అందువలన 25 వేల వరకు ఖాళీలు ఉండే అవకాశం ఉందని సమాచారం. ఈ నెల చివరకు మోడల్, జిల్లా పరిషత్, ప్రభుత్వ పాఠశాలలకు 3 వేల మంది కొత్త టీచర్లు రాబోతున్నారని సమాచారం. అధికారంలోకి వచ్చిన తక్కువ సమయంలోనే వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగులకు మేలు చేకూరేలా నిర్ణయాలు తీసుకుంటూ ఉండంటంపై నిరుద్యోగ యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: