మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో భోపాళ్ ప్రాంతంలో ఈరోజు ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. గణేశ్ నిమజ్జనం కోసం వెళ్లిన ఒక బోట్ ఖట్లాపూర ఘాట్ వద్ద మునిగిపోయింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు. సహాయక బృందాలు ఐదు మందిని కాపాడాయని సమాచారం. మరికొంతమంది గల్లంతవటంతో వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ రోజు ఉదయం 4 : 30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. 
 
మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి పీసీ శర్మ ఇప్పటివరకు 11 మృతదేహాలను వెలికితీసినట్లు మీడియాకు తెలిపారు. గణేశ్ నిమజ్జన ఉత్సవంలో ఇలాంటి ఘటన జరగటం ఎంతో బాధాకరమైన విషయమని పీసీ శర్మ చెప్పారు. 4 లక్షల రుపాయల పరిహారం మృతులకు ప్రభుత్వం ఇవ్వబోతున్నట్లు పీసీ శర్మ ప్రకటించారు. తక్షణమే ఈ ఘటన జరగటానికి గల కారణాలపై నివేదిక ఇవ్వాలని మంత్రి పీసీ శర్మ అధికారులను ఆదేశించారు. 
 
బోట్ మునిగిన సమయంలో ఎంతమంది ఉన్నారనే విషయం గురించి స్పష్టత రావాల్సి ఉంది. గజ ఈతగాళ్లు, పోలీసులు, అధికారులు, ఎన్డీ ఆర్ ఎఫ్ బృందం సహాయక చర్యలను కొనసాగిస్తున్నారని సమాచారం. ఇప్పటికే ఐదుగురిని రక్షించగా ఇంకా ఎవరైనా నదిలో చిక్కుకున్నారా అనే అనుమానంతో గాలింపు చర్యలను కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ ఘటనలో చనిపోయిన వారంతా పిప్లాని ప్రాంతానికి చెందిన వారిగా అధికారులు గుర్తించినట్లు సమాచారం. 
 
ప్రస్తుతం అధికారులు చనిపోయిన వారి కుటుంబాలకు ఈ సమాచారాన్ని అందించి మృతదేహాలను తరలిస్తున్నట్లు తెలుస్తోంది. నదిలో ఇంకా ఎవరైనా ఉన్నారేమో అని గజ ఈతగాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ విషాదం గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం సహాయక చర్యల్లో పోలీసులు మరియు ఇతర సిబ్బంది నిమగ్నమై ఉన్నారు. స్థానికులు ఈ ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. 




మరింత సమాచారం తెలుసుకోండి: