షార్ కు 50 కిలోమీటర్ల మేర బంగాళాఖాతం తీరంలో  సీ ఐ ఎస్ ఎఫ్ పోలీసులు, మెరైన్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. అధికారులు తీరం దగ్గర గస్తీ ముమ్మరం చేశారు. సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లో హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. షార్ గేట్ వద్ద భద్రతా దళాలు తనిఖీలు కొనసాగిస్తున్నాయి. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాలు కూడా అప్రమత్తమయ్యాయి. తీర ప్రాంతం మీదుగా ఉగ్రవాదులు దేశంలోకి చొరబడే అవకాశం ఉందంటూ నిఘా వర్గాల నుండి హెచ్చరికలు వచ్చాయి. 
 
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రాంతంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు మూడు రోజుల నుండి చేస్తున్నారని సమాచారం. నెల్లూరు జిల్లాలో రొట్టెల పండుగ ఐదు రోజుల పాటు జరుగుతుంది. ఈ పండుగకు దేశవిదేశాల నుండి  ఎంతో మంది భక్తులు ఈ ప్రాంతానికి వస్తారు. లష్కరే తోయిబా తీవ్రవాదులు నాటు పడవలను ఉపయోగించి ఈ ప్రాంతంలో చొరబడే అవకాశం ఉందని హెచ్చరికలు రావటం జరిగింది. 
 
నెల్లూరు జిల్లా 175 కిలోమీటర్ల తీర ప్రాంతం కావటంతో ఉగ్రవాదులు వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఆర్టికల్ 370 రద్దు చేసిన తరువాత లష్కరే తోయిబా ఉగ్రవాదులు విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నారని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేసాయి. షార్ ప్రాంతంలో పోలీసులు క్షుణ్ణంగా గాలిస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ ఉన్న మత్స్యకారులను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారని సమాచారం. 
 
శ్రీహరికోట అడవుల దగ్గర కూడా కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. వేనాడు దర్గాకు వచ్చే వాహనాలను కూడా పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపిస్తున్నారు. సంచార వాహనాల ద్వారా పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్నారు. కొత్తవారి కదలికపై పోలీసులు నిఘా ఉంచారు. పోలీసులు తీర ప్రాంత గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేనంతగా పోలీసులు ప్రస్తుతం భద్రతా చర్యలు చేపట్టారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: