ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆ పార్టీ 23 సీట్లకే పరిమితమై పెద్ద షాక్ తింది. ఇక ఈ షాకుని కొనసాగిస్తూ...పలువురు నేతలు టీడీపీకి వరుస షాకులు ఇస్తూ పోతున్నారు. ఇప్పటికే పలువురు అధినేత చంద్రబాబుకు గట్టి షాక్ ఇస్తూ...బీజేపీ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. అలాగే మరికొందరు వైసీపీలో చేరుతున్నారు. తాజాగా కూడా టీడీపీ నుంచి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి.


ఈ క్రమంలోనే సీఎం జగన్ సొంత గడ్డ కడపలో టీడీపీకి భారీ షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీని నేతలు వరుసగా వీడేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో జిల్లాలో టీడీపీ తుడిచిపెట్టుకుపోయే స్థితికి చేరుకుంది. ఎన్నికల ముందే కొందరు నేతలు వైసీపీ తీర్ధం పుచ్చుకున్న విషయం తెలిసిందే. ఇక ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబుతో సన్నిహితంగా మెలిగే రాజ్యసభ్య సభ్యుడు సీఎం రమేశ్ బీజేపీలోకి జంప్ అయిపోయారు.


ఇక్కడ నుంచే జిల్లా నేతలు పార్టీ జంప్ చేసేందుకు రెడీ అయ్యారు. 2014లో వైసీపీ నుంచి గెలిచి… ఆ తర్వాత టీడీపీలో చేరి మంత్రి అయ్యి కడపలో కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి....బీజేపీలో చేరడం ఖాయమైంది. ఆదితో పాటు మరికొందరు కీలక నేతలు కూడా కాషాయ కండువా కప్పుకొనున్నారు. అలాగే స్థానికంగా వైసీపీతో ఇబ్బందులు ఉన్న దృష్ట్యా...ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు బీజేపీలోకి వెళ్లనున్నారు. ఇక ఎన్నిక‌ల ఫ‌లితాల్లోనే జిల్లా ప్ర‌జ‌లు గుండు సున్నా పెట్టార‌నుకుంటే ఇప్పుడు పార్టీ నేత‌లు కూడా పార్టీకి సున్నా చుట్టేస్తున్నారు.


ఇక కడపలో కీలకంగా ఉన్న నేతలు రామసుబ్బారెడ్డి, వీర శివారెడ్డిలు కూడా టీడీపీకి గుడ్ బై చెప్పనున్నారని తెలుస్తోంది. వీరిద్దరు వైసీపీలో చేరే అవకాశం ఉంది. వీరితో పాటు మరికొందరు కూడా జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకొనున్నారు. మొత్తం మీద అధికారంలో ఉన్నప్పుడూ కడపని తామే అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకున్న చంద్రబాబుకు ఆ జిల్లా నేతలే షాక్ ఇవ్వడం గమనార్హం. 



మరింత సమాచారం తెలుసుకోండి: