ఆంధ్రులకు అత్యంతావశ్యకమైన రాజధాని అమరావతిపై విషప్రచారం చేయడమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ఆ ప్రాంత రైతులు స్వచ్ఛందంగా 34 వేల ఎకరాలిస్తే, అక్కడ 30 ఇళ్లు కూడా నిర్మించలేదని దుర్మార్గపు ప్రచారం చేయడం వైసీపీకే చెల్లిందని మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనానంతరం అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని నిలబెడుతూ రాజధాని నిర్మాణాన్ని చేపట్టిందని, రూ.9వేల కోట్ల రూపాయల అభివృద్ధిపనులు చేయించి, అమరావతిని ప్రపంచపటంలో నిలిపేందుకు  కృషి చేసిందని నక్కా స్పష్టం చేశారు. 

కొత్తగా వచ్చిన వైసీపీ ప్రభుత్వం రాజధాని నిర్మాణాన్ని అపహాస్యం చేస్తూ, రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేసేలా వ్యవహరిస్తోందన్నారు. స్వయంగా రాష్ట్ర ఆర్థికమంత్రే రాజధాని నిర్మాణానికి డబ్బులు లేవని విదేశాల్లో దుష్ప్రచారం చేయడం మనరాష్ట్ర పరువుని మనమే తీసుకోవడం కాదా అని ఆనంద్‌బాబు ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన దూరదృష్టిని ఉపయోగించి, రాష్ట్ర ఆర్థికస్థితి దృష్యా, సెల్ఫ్‌ ఫైనాన్సింగ్‌ పద్ధతిలో అమరావతి నిర్మాణం జరిగేలా ముందుచూపుతో పనులు జరిపించారని మాజీమంత్రి పేర్కొన్నారు. 


రాష్ట్ర ఆర్థికమంత్రి వ్యాఖ్యలతో రాజధాని నిర్మాణంపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏమిటో ప్రజలందరికీ బోధపడిందన్నారు. రాజధానిలో  ప్రభుత్వం ఖర్చుపెట్టే ప్రతిరూపాయిపై పన్నులు, జీఎస్టీ, ఇతరేతర మార్గాల్లో తిరిగి ఆదాయం వచ్చేలా చంద్రబాబుగారు నిర్మాణపనులకు అంకురార్పణ చేశారని ఆనందబాబు వివరించారు. ప్రజలందరికీ ఉపయుక్తమైన, లక్షా 40వేల మందికి పైగా నివాసముండే రాజధాని ప్రాంతంపై కక్షపూరితంగా, కావాలనే రాష్ట్రప్రభుత్వం, సామాజిక వర్గాల పేరుతో అసత్య ప్రచారం చేస్తోందన్నారు. ఆ ప్రాంతంలో ఎస్టీలు 32వేలమంది, బీసీలు 20 వేలకు పైగా, కమ్మ, కాపు, రెడ్లు 20వేల మందికి పైగా నివాసముంటే, ఆ విషయాలేవీ చెప్పకుండా కేవలం ఒక సామాజిక వర్గాన్నే దృష్టిలో పెట్టుకొని, గత ప్రభుత్వం రాజధానిని ఎంపిక చేసిందని దుష్ప్రచారం చేయడం  ప్రభుత్వ యంత్రాంగానికి, మంత్రులకు తగదని నక్కా సూచించారు. 


ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు  రాజధానికి 30 నుంచి 40 వేల ఎకరాలు అవసరమన్న జగన్మోహన్‌రెడ్డే, అధికారంలోకి వచ్చాక మాటమార్చడం ఏమిటని, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ పేరుతో మంత్రులతో అవాస్తవాలు ప్రచారం చేయడం ఎంతవరకు భావ్యమని ఆనందబాబు నిలదీశారు. నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌, కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ప్రాంతాన్ని, నిర్మాణాలకు అనుకూలం కాదని చెప్పడం వైసీపీ మంత్రులకే చెల్లిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేకుండా చేయడం, రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేయాలన్న ఆశయంతోనే వైసీపీ ప్రభుత్వం పనిచేస్తోందని నక్కా ఎద్దేవా చేశారు. రాజధానిని అభివృద్ధి చేస్తూ, తద్వారా పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేలా చేయాల్సిన ప్రభుత్వం, రాష్ట్ర వ్యాప్తంగా భూముల ధరలు పడిపోయేలా అనాలోచిత నిర్ణయాలు చేస్తోందన్నారు.   


మరింత సమాచారం తెలుసుకోండి: