గ‌ణేష్‌ నిమ‌జ్జ‌నం సంద‌ర్భంగా న‌గ‌రంలో  దాదాపు 8,000 మెట్రిక్ ట‌న్నుల వ్య‌ర్థాలు, చెత్త‌ను జీహెచ్ఎంసి తొల‌గించింది. ప్ర‌తిరోజు దాదాపు 4,500 మెట్రిక్ ట‌న్నులకు పైగా చెత్త న‌గ‌రంలో ఉత్ప‌త్తి అవుతుండ‌గా కేవ‌లం శుక్రవారం నిమజ్జనం సందర్భంగా 8వేల మెట్రిక్ ట‌న్నుల‌ చెత్తను ప్ర‌త్యేకంగా సేక‌రించారు. ప్ర‌ధానంగా నిమజ్జనం అయిన 12వ తేదీ నుండి నేడు ఉద‌యం వ‌ర‌కు అద‌నంగా 8వేల మెట్రిక్ ట‌న్నుల వ్య‌ర్థాల‌ను తొల‌గించి న‌గ‌రంలోని 17 ట్రాన్స్‌ఫ‌ర్ స్టేష‌న్‌ల‌కు పంపించారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో నిమ‌జ్జ‌న శోభ‌యాత్ర జ‌రిగిన 391 కిలోమీట‌ర్ల విస్తీర్ణంలో దాదాపు 9,849 మంది పారిశుధ్య కార్మికులను ప్ర‌త్యేకంగా జీహెచ్ఎంసీ నియ‌మించింది. ప్ర‌ధానంగా  ట్యాంక్‌బండ్, న‌క్లెస్‌రోడ్‌, ఎన్టీఆర్ మార్గ్‌, బ‌షిర్‌బాగ్ త‌దిత‌ర మార్గాల్లో జ‌రిగిన గ‌ణేష్ నిమ‌జ్జ‌నానికి వేలాది మంది ప్ర‌జ‌లు రావ‌డం, గ‌ణేష్ మండ‌పాల నుండి వ‌చ్చిన‌ ప‌త్రి, పూలు, ఇత‌ర ప‌దార్థాల‌తో అద‌నంగా చెత్త ఏర్ప‌డింది. వీటిని తొల‌గించ‌డానికి జీహెచ్ఎంసి నియ‌మించిన ప్ర‌త్యేకంగా 194 గ‌ణేష్ యాక్ష‌న్ బృందాలు రేయింప‌గ‌ళ్లు కృషిచేసి ఈ చెత్త‌ను ఎత్తివేయ‌డంలో స‌ఫ‌లీకృత‌మ‌య్యాయి.



ప్ర‌ధాన ర‌హ‌దారులలో పారిశుధ్య సిబ్భంది నిర్వ‌హించిన సేవ‌లు శ్లాగ‌నీయ‌మ‌ని, గ‌తంలో జ‌రిగిన నిమ‌జ్జ‌నాల సంద‌ర్భంగా క‌నీసం రెండు రోజుల పాటు ఈ మార్గాలు చెత్తాచెదారంతో ఉండేవ‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డ్డారు. నిమ‌జ్జ‌నం రోజైన గురువారం నాడు 11వేల మంది పారిశుధ్య, ఎంట‌మాల‌జి సిబ్బంది నిమ‌జ్జ‌న శోభ‌యాత్ర మార్గాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచేందుకు విశేషంగా కృషిచేశార‌ని  నగర మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు.  అదేవిధంగా నిమ‌జ్జ‌నం సంద‌ర్భంగా ఎదుర‌య్యే స‌మ‌స్య‌ల‌ను డ‌య‌ల్ 100, మైజీహెచ్ఎంసీ యాప్‌, జీహెచ్ఎంసీ కాల్ సెంట‌ర్ల ద్వారా అతి త‌క్కువ ఫిర్యాదులందాయన్నారు. నిమజ్జన ప్రధాన ప్రాంతాలైన ఎం.టి.ఆర్ మార్గ్, ట్యాంక్ బండ్ తదితర ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు బ్లీచింగ్ పౌడర్ చల్లడంతో దుర్వాసనలు లేకుండా అరికట్టగలిగారన్నారు. ఈ సారి నిమజ్జనంలో జిహెచ్ఎంసి ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం కూడా విశేష సేవలను అందించిందన్నారు. ట్యాంక్ బండ్ నక్లెస్ రోడ్ లో ప్రమాదశాతు హుస్సేన్ సాగర్ లో పడకుండా బారీ కేడింగ్ చేపట్టడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో కాపాడటానికి ప్రత్యేక బోట్ లను ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 




న‌గ‌రంలో హుస్సేన్ సాగ‌ర్‌తో పాటు 35 ప్రాంతాల్లో 55వేల‌కు పైగా విగ్ర‌హాల నిమ‌జ్జ‌నం జ‌రిగింద‌ని నగర మేయర్ బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు. హుస్సేన్ సాగ‌ర్‌లోనే 15వేలకు పైగా విగ్ర‌హాల నిమ‌జ్జ‌నం అయ్యాయ‌ని పేర్కొన్నారు. వివిధ శాఖ‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌యంతో ఏవిధ‌మైన స‌మ‌స్య‌లు త‌లెత్త‌కుండా నిమ‌జ్జ‌న కార్య‌క్ర‌మం విజ‌య‌వంతంగా ముగిసింద‌న్నారు. రికార్డు స్థాయిలో 55వేల విగ్ర‌హాల నిమ‌జ్జ‌నానికి, పారిశుధ్య కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ‌ను స‌మ‌ర్థ‌వంతంగా చేప‌ట్టినందుకు జీహెచ్ఎంసీ కార్మికుడి నుండి ఉన్న‌తాధికారుల‌ను అభినందించారు.
న‌గ‌రంలో చెరువులు కాలుష్యానికి గురికాకుండా ఉండేందుకు గ‌ణేష్ నిమ‌జ్జ‌నానికి ప్ర‌త్యేకంగా నిర్మించిన 23 ప్ర‌త్యేక నిమ‌జ్జ‌న కొల‌నుల‌లో 20వేలకు పైగా విగ్ర‌హాల‌ను నిమ‌జ్జ‌నం చేసారని క‌మిష‌న‌ర్ లొకేష్ కుమార్ తెలిపారు. కొన్ని నిమ‌జ్జ‌న కొల‌నుల్లో అధిక సంఖ్య‌లో విగ్ర‌హాల నిమ‌జ్జనం జ‌రిగింద‌న్నారు. ప్ర‌ధానంగా నెక్నాంపూర్ చెరువు కొలను, దుర్గం చెరువు, మ‌ల్కం చెరువు, రాజేంద్ర‌న‌గ‌ర్ ప‌త్తికుంట కొల‌ను, కూక‌ట్‌ప‌ల్లి రంగ‌దామునిచెరువులో, కుత్బుల్లాపూర్ లింగంచెరువు పాండ్‌లో, అల్వాల్ కొత్త చెరువులలో అధిక సంఖ్యలో విగ్ర‌హాలను నిమ‌జ్జ‌నం చేశారని లొకేష్ కుమార్ పేర్కొన్నారు. గణేష్ నిమజ్జనం అనంతరం ఈ కొలనులను బతుకమ్మల నిమజ్జనానికి వినియోగించనున్నట్టు కమిషనర్ ప్రకటించారు. అయితే నిమజ్జన అనంతరం గణేష్ నిమజ్జన చెరువులను పూర్తిస్థాయిలో ఖాళీ చేసి దోమల ఉత్పత్తి కేంద్రాలు కాకుండా గంబూసియా చేపలను వదలడం, లార్వా నివారణ మందును వేయనున్నట్టు కమిషనర్ తెలిపారు.




గణేష్ నిమజ్జనం సందర్భంగా నగరంలోని పలు గణేష్ మండపాల వద్ద ఉచితంగా జిహెచ్ఎంసి మొక్కలను  పంపిణీ చేశామన్నారు. జిహెచ్ఎంసి అర్బన్ బయోడైవర్సిటీ విభాగం ఆధ్వర్యంలో నగరంలోని పలు మండపాల వద్ద ప్రత్యేకంగా మొక్కలను పంపిణీ చేశారన్నారు. ప్రధానంగా తులసి, పూల మొక్కలను దాదాపు రెండు లక్షలను పంపిణీ చేసినట్టు తెలిపారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా ట్యాంక్ బండ్, ఎం.టి.ఆర్ మార్గ్ లతో పాటు వివిధ నిమజ్జన కేంద్రాల్లో స్వచ్ఛంద సంస్థలు విశేష సేవలు అందించాయని చెప్పారు. నిమజ్జన శోభ యాత్రలో పాల్గొన్నవారికి మంచినీటి సౌకర్యం కల్పించడంతో పాటు అన్నదానాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారన్నారు. ప్లాస్టిక్ మ్యానిఫ్యాక్చర్స్ అసోసియేషన్ ఆద్వర్యంలో ఉచితంగా టీ-షర్ట్ ల పంపిణీ నిర్వహించారని చెప్పారు. వివిధ ప్రాంతాల్లో లూ-కేఫే లలో మరుగుదొడ్లను పెద్ద ఎత్తున ఉపయోగించుకున్నారని వివరించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: