మంత్రి పదవి ఆశించిన  అసంతృప్తి గళాన్ని  వినిపించిన ఎమ్మెల్యేలు  ,  అజ్ఞాతంలోకి వెళ్లిన ఇద్దరు శాసనసభ్యులు  పార్టీ నాయకత్వం బుజ్జగించడం తో తాము కేసీఆర్ , కేటీఆర్ నాయకత్వంలోనే పని చేస్తామని చెప్పుకొచ్చారు . పార్టీ లో తగిన గౌరవం లభించడం లేదని , ఆత్మగౌరవం లేని చోట కొనసాగలేనన్న బోధన్ ఎమ్మెల్యే షకీల్ , పార్టీ  మారేందుకు సిద్ధమై నిజామాబాద్  ఎంపీ అరవింద్ ను కలిసిన విషయం తెల్సిందే . పార్టీ మారే అంశంపై సోమవారం మీడియా తో మాట్లాడుతానని చెప్పిన షకీల్  సైతం మనసు మార్చుకుని తనకు కెసిఆర్ రాజకీయ గాడ్ ఫాదర్ అంటూ చెప్పుకొచ్చారు.


 తాను ముఖ్యమంత్రి ని ఎప్పుడూ మంత్రి పదవి అడగలేదని , పార్టీ మారేది లేదని తేల్చేశారు . కేబినెట్ విస్తరణ లో  మంత్రి పదవి ఆశించిన  పలువురు ఎమ్మెల్యేలు అసంతృప్తి గళం వినిపించడానికి,  అజ్ఞాతంలోకి వెళ్లడానికి ...  పార్టీ మారడానికి తాము సిద్ధమేనంటూ సంకేతాలను ఇవ్వడం వెనుక ,  పార్టీ నాయకత్వాన్ని బెదిరించి తమ దారిలోకి తెచ్చుకోవాలన్న ధోరణి కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అయితే పార్టీ నాయకత్వం వారి బెదిరింపులను లెక్క చేయకపోవడం,  కొంతమందిని బుజ్జగించడం మరికొంత మందికి హెచ్చరికలు జారీ చేయడం వంటివి చేసిందని టిఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.


 మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య , మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి , మాజీ అటవీశాఖ మంత్రి జోగురామన్న వంటివారితో  మున్సిపల్ శాఖ మంత్రి  కేటీఆర్ మాట్లాడారని, భవిష్యత్తులో తప్పక మంచి అవకాశాలను  పార్టీ నాయకత్వం కల్పిస్తుందని హామీ ఇచ్చారని అంటున్నారు  . ఇక పార్టీ మారాలని అనుకుని నిజామాబాద్ ఎంపీ అరవింద్ ను కలిసిన షకీల్ ను మాత్రం పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా , వెంటనే అనర్హత వేటు వేసేవిధంగా చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరికలు పంపడం తో చేసేది లేక షకీల్ దారికి వచ్చారని  పార్టీ వర్గాలు తెలిపాయి .


మరింత సమాచారం తెలుసుకోండి: