ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఏదైనా హాట్ టాపిక్ ఉందంటే అది రాజధాని అమరావతి గురించే. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి పేరుతో గుంటూరు జిల్లాలోని ప్రాంతాన్ని ఎంపిక చేసింది.  సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోయింది. వైసీపీ అధికారం చేపట్టాక రాజధాని నిర్మాణంపై వెనకడుగు వేస్తోందని ప్రతిపక్ష టీడీపీ ఆరోపిస్తోంది. ఇటీవల రాజధాని అంశంపై అనేక పరిణామాలు జరిగాయి. రాజధాని కోసం భూములిచ్చిన రైతులు కూడా ఆందోళనలు చేశారు. ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకున్న  ప్రభుత్వం దీనిపై ఓ కమిటీ వేసింది. 

 

 

 

ఆంధ్రప్రదేశ్‌ రాజధానితో సహా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల అభివృద్ధిపై నిపుణుల కమిటీ ఏర్పాటైంది. రాజధాని, రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో జరుగుతున్న పనులు, ప్రణాళికలను ఈ కమిటీ సమీక్షించి ఓ నివేదిక ఇవ్వనుంది. కమిటీ కన్వీనర్‌గా రిటైర్డ్‌ ఐఎఎస్‌ అధికారి జీఎన్‌ రావు నియమితులయ్యారు. అయిదుగురు సభ్యులతో ఏర్పాటు అయిన ఈ కమిటీలో ఢిల్లీలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ డీన్ డాక్టర్ మహావీర్, అర్బన్ ప్లానర్ డాక్టర్ అంజలీ మోహన్‌, ఢిల్లీలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ రిటైర్డ్ ప్రొఫెసర్ కేటీ రవీంద్రన్‌, స్టెప్ ప్రొఫెసర్ శివానందస్వామి, చెన్నైకి చెందిన రిటైర్డ్ అర్బన్ ప్లానర్ డాక్టర్‌ కేవీ అరుణాచలం ఉన్నారు. ఆరు వారాల్లో దీనిపై సవివర నివేదిక సమర్పించాలని మున్సిపల్ శాఖ కమిటీని కోరింది.

 

 

 

అయిదేళ్ల టీడీపీ హయాంలో అసెంబ్లీ, సచివాలయం, తాత్కాలిక హైకోర్టు.. నిర్మించింది. కొన్ని నిర్మాణాలు మధ్యలో ఉన్నాయి. గతంలో చేపట్టిన నిర్మాణాలలో అవకతవకలు జరిగాయన్నది ప్రభుత్వ ఆరోపణ. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్నది వైసీపీ ప్రభుత్వ ఉద్దేశం. అందుకే నిపుణులైన వారిని ఎంపిక చేసి ఓ రిపోర్టు ఇవ్వాలని కోరింది. దీనిపై ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక ఇచ్చాక ప్రభుత్వ నిర్ణయమేంటో వేచిచూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: