ఈ మధ్య కాలంలో డేటింగ్ సైట్లు, యాప్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొత్త స్నేహితుల్ని పరిచయం చేసుకోవాలనుకునే వారి కోసం యాప్ డౌన్ లోడ్ చేసుకుంటే చాలు..! మీకు నచ్చిన స్నేహితుల్ని ఎంచుకోవచ్చు అనే ప్రకటనలు ఎక్కువైపోయాయి. యువత లక్ష్యంగా ఇలాంటి యాప్ లు, సైట్లు పుట్టుకొస్తున్నాయి. వీటిని కొందరు కొత్త స్నేహితుల పరిచయం కోసం ఉపయోగిస్తుంటే మరికొందరు మాత్రం మోసం చేయాలనే ఆలోచనతోనే ఉపయోగిస్తున్నారు. 
 
డేటింగ్ యాప్ ద్వారా మోసపోయినవారు ఆ విషయం గురించి పోలీసులకు, కుటుంబ సభ్యులకు చెప్పటానికి కూడా భయపడుతున్నారు. సైబర్ నేరగాళ్లు కూడా డేటింగ్ యాప్స్ ఉపయోగించి మోసాలు చేస్తున్న ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. స్కౌట్ అనే డేటింగ్ యాప్ ఎంతోమంది యువకులను, విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని మోసాలు చేస్తుందని సమాచారం. సోషల్ మీడియాలో ప్రకటనల ద్వారా యాప్ డౌన్ లోడ్ చేసుకోమని చెబుతారు. 
 
యాప్ డౌన్ లోడ్ చేసుకున్న వారికి ఈ యాప్ ద్వారా అమ్మాయిలతో వీడియో కాల్ మాట్లాడవచ్చని కానీ అలా మాట్లాడాలంటే కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుందని యాప్ లో సమాచారం ఉంచుతారు. ఎవరైనా మాట్లాడాలనే ఆశతో డబ్బులు పంపితే ఆ తరువాత వారి నెంబర్ బ్లాక్ చేస్తారు. ఇలా డబ్బు కోసం మోసం చేస్తున్న ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వీడియో కాల్స్ మాట్లాడే సమయంలో స్క్రీన్ షాట్లు తీసి మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. 
 
డేటింగ్ సైట్ల ద్వారా కొందరు నగ్న చిత్రాలను ఇతరులతో పంచుకుంటున్నారు. ఆ తరువాత మోసపోయామని గ్రహిస్తున్నారు. ఒక సర్వే ప్రకారం 57 శాతం మంది వ్యక్తులు డేటింగ్ యాప్స్ ద్వారా అబధ్ధాలే ఎక్కువగా చెబుతున్నారని తెలుస్తోంది. సైబర్ నిపుణులు డేటింగ్ సైట్లు ఉపయోగించేవారు అవతలి వ్యక్తి డబ్బుల గురించి మాట్లాడుతుంటే మోసగాళ్లని గుర్తించాలని చెబుతున్నారు. డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన వ్యక్తులు నేరుగా కలుద్దామంటే ముందూ వెనకా ఆలోచించకుండా వెళ్లకూడదని సలహాలిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: