తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 5, 8 తరగతులకు కూడా ఈ విద్యా సంవత్సరం నుండి పబ్లిక్ పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై ఇప్పటికే ప్రభుత్వం అధికారులకు ఉత్తర్వులను జారీ చేసినట్లు తెలుస్తోంది. సాధారణంగా పబ్లిక్ పరీక్షలను 10 వ తరగతి మరియు ప్లస్ 2 లకు నిర్వహిస్తారు. 1 వ తరగతి నుండి 9 వ తరగతి వరకు సాధారణ పరీక్షలను నిర్వహిస్తారు. 
 
1 వ తరగతి నుండి 9 వ తరగతి వరకు నిర్వహించే పరీక్షలలో విద్యార్థులు ఉత్తీర్ణులైనా కాకపోయినా విద్యార్థులను పై తరగతులకు అనుమతించటం జరుగుతుంది. ఇలా చేయటం వలన విద్యార్థులలో ప్రతిభా సామర్థ్యాలు తగ్గిపోతున్నాయి. అందువలన తమిళనాడు రాష్ట్ర విద్యా కమిటీ 5, 8 తరగతులకు కూడా పబ్లిక్ పరీక్షలను నిర్వహించాలని సిఫారసు చేసింది. ప్రతిపక్షాలు మాత్రం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేఖించినట్లు తెలుస్తోంది. 
 
ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వం పాఠ్య ప్రణాళికలో మార్పులు చేయటంతో పాటు, పరీక్షల నిర్వహణలో కూడా కొన్ని మార్పులను చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం విద్యా వ్యవస్థ మార్పుల్లో భాగంగా 10 వ తరగతి, ప్లస్ 2 పరీక్షలకు ర్యాంకుల విధానాన్ని కూడా రద్దు చేసినట్లు తెలుస్తోంది. గత విద్యా సంవత్సరం ప్లస్ 1 పరీక్షలకు కూడా పబ్లిక్ పరీక్షలను ప్రవేశపెట్టింది. 
 
ఈ కొత్త విధానం ద్వారా విద్యార్థులు పై తరగతులకు వెళ్లటం కష్టమవుతుందని విద్యావేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విద్యా వేత్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని 5, 8 తరగతి పబ్లిక్ పరీక్షలలో ఉత్తీర్ణులు కాని విద్యార్థులను కూడా పై తరగతులకు అనుమతించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు తెలుస్తుంది. లాంగ్వేజ్ పరీక్షలకు గతంలో రెండు పేపర్లు ఉండగా ఈ సంవత్సరం నుండి ఒకే పేపర్ ఉండబోతుందని సమాచారం. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: