వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్లో తాజాగా చేసిన ఆరోపణలతో అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి.  విజయసాయి అన్నారని కాదు కానీ ఎన్నికల ముందు తర్వాత  బిజెపిలో నేతల్లో వచ్చిన మార్పు చూస్తే ఆ విషయం స్పష్టంగా తెలిసిపోతుంది. ఎన్నికలకు ముందు చంద్రబాబునాయుడుపై ప్రతిరోజు బిజెపి నేతలు అవినీతి ఆరోపణలు చేసిన విషయం అందరికీ తెలిసిందే.

  

ప్రతి ప్రాజెక్టులోను అవినీతికి పాల్పడిన చంద్రబాబును జైల్లో పెట్టాల్సిందేనంటూ సోము వీర్రాజు, మాధవ్, ధియెధర్, కన్నా లక్ష్మీనారాయణ లాంటి నేతలు ప్రతిరోజు మీడియాలో ఊదరగొట్టిన వారే. సరే తర్వాత జరిగిన ఎన్నికల్లో చంద్రబాబుకు జనాలు గూబ పగలగొట్టారు. అఖండ మెజారిటితో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు.

 

జగన్ అఖండ మెజారిటితో అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే బిజెపి నేతల గొంతుల్లో మార్పులు కనిపించాయి. కారణాలు ఏమిటంటే టిడిపిలో చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన నాలుగురు రాజ్యసభ ఎంపిలు సుజనా చౌదరి, సిఎం రమేష్, గరికపాటి మోహన్ రావు, టిజి వెంకటేష్ లు బిజెపిలోకి ఫిరాయించారు. అంటే తన రక్షణ కోసమే చంద్రబాబు ముందు జాగ్రత్తగా పై నలుగురిని బిజెపిలోకి పంపించారు.

 

ఎప్పుడైతే వీరు నలుగురు బిజెపిలో చేరారో రాష్ట్రంలోని బిజెపి నేతల్లో చంద్రబాబు విషయంలో మార్పులు మొదలయ్యాయి. అంత వరకూ చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు చేసిన నేతలంతా ప్లేటు ఫిరాయించి జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలు మొదలుపెట్టారు. చిత్రమేమిటంటే వీరెవరూ ఇపుడు చంద్రబాబు అవినీతిపై నోరే విప్పటం లేదు.

 

రాష్ట్ర వ్యవహారాల్లో ఫిరాయింపు ఎంపి సుజనా దే యాక్టివ్ పార్టుగా మారిపోయింది. బిజెపిలోని సీనియర్ నేతలంతా కన్నాతో సహా సుజనాను ఫాలో అవుతున్నారు. అంటే రాష్ట్ర బిజెపిలో చంద్రబాబు బినామీలుగా ప్రచారంలో ఉన్న సుజనా అండ్ కో దే పై చేయిగా అర్ధమవుతోంది. అందుకనే రాజకీయాలను దగ్గర నుండి చూస్తున్న వారందిరికీ రాష్ట్ర బిజెపి వ్యవహారాలంతా చంద్రబాబు కంట్రోల్లోకి వెళ్ళిపోయినట్లు అనుమానిస్తున్నారు.

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: