ప్రభుత్వం మారినా..కర్ణాటక రాజకీయాల్లో వేడి మాత్రం తగ్గలేదు. మొన్నటివరకు కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని దించేవరకు కమలదళం నిద్రపోలేదు. ఇక ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందని కాంగ్రెస్-జేడీఎస్ నేతలు ఎదురుచూస్తున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్-జేడీఎస్ లకు సంబంధించిన 17 మంది ఎమ్మెలేల రాజీనామాతో ఆ ప్రభుత్వం కూప్పకూలి యడియూరప్ప నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇక రాజీనామా చేసిన 17 మందిపై అప్పటి కాంగ్రెస్ స్పీకర్ రమేశ్ కుమార్ అనర్హత వేటు కూడా వేశారు. అయితే ఈ అనర్హత వ్యవహారం ప్రస్తుతం సుప్రీం కోర్టులో ఉంది.


ఆ విషయాన్ని పక్కనబెట్టేస్తే తాజాగా  జేడీఎస్ నాయకుడు శరణ గౌడ నాయక్ కుందకూర...సీఎం యడియూరప్పని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2020 ఫిబ్రవరి వరకు యడియూరప్ప సీఎంగా ఉంటారని, తరువాత బీజేపీలోని మరో ప్రముఖ నాయకుడు సీఎం కుర్చిలో ఉంటారని పెద్ద బాంబు పేల్చారు. తాజాగా కర్ణాటకలోని గురుమిట్కల్ లో జేడీఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... అంతకముందు యడియూరప్ప చేసిన ఆపరేషన్ కమల ఆడియో కేసు మళ్లీ రీఓపెన్ చెయ్యాలని బీజేపీకి చెందిన నాయకులే తమ మీద ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు.


అయితే సీఎం యడియూరప్పకు అదే బీజేపీలోని ఓ ప్రముఖ నాయకుడు చెక్ పెడుతున్నారని, ఆ నాయకుడు ఇప్పటికే తనతో చాలాసార్లు ఫోన్ లో మాట్లాడారని శరణ గౌడ సంచనల విషయం చెప్పారు. బీజేపీకి చెందిన ఓ సీనియర్ నాయకుడు యడియూరప్ప వెనుక నుంచి గోతి తవ్వుతున్నారని, ఆయన భవిష్యత్తు నాచేతిలో ఉందని శరణ గౌడ అన్నారు. రెండు రోజుల్లో గురుమిట్కల్ నియోజక వర్గం అభివృద్దికి నిధులు మంజూరు చెయ్యకుంటే ఆపరేషన్ కమల కేసు రీ ఓపెన్ చేయిస్తానని యడియూరప్పకు వార్నింగ్ కూడా ఇచ్చారు.


యడియూరప్ప ఫిబ్రవరిలో బడ్జెట్ ప్రవేశపెట్టిన వెంటనే సీఎం పదవికి రాజీనామా చేస్తారని.. ఆ వెంటనే బీజేపీలోని మరో నేత సీఎం పీఠంలో కూర్చుంటారని హెచ్చరించారు. కాగా, గత కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న శంకర గౌడతో బీఎస్. యడియూరప్ప, హాసన్ ఎమ్మెల్యే ప్రీతం గౌడ, మరో బీజేపీ నాయకుడు ఫోన్ లో ఆపరేషన్ కమలం గురించి మాట్లాడిన వివరాల ఆడియోను బయటకు విడుదల చేసిన విషయం తెలిసిందే. అప్పుడే శంకర గౌడ దీనిపై కేసు కూడా పెట్టారు.



మరింత సమాచారం తెలుసుకోండి: