పాఠశాలలో నాల్గో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినీ  రాసిన లేఖకు స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటనే కార్యరంగంలోకి దిగారు. ఈ విషయంలో నెలకొన్న పరిస్థితులను అధ్యయనం చేసి తక్షణమే పరిష్కరించాలంటూ జిల్లా కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గ్రామంలోని కక్షల కారణంగా  తమ కుటుంబంపై నెలల తరబడి కొనసాగుతున్న కులకట్టుబాటు పై ఆవేదన చెందిన ఆ  విద్యార్థి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళింది.  ఆ చిన్నారి తమ కుటుంబాన్ని గ్రామం నుంచి వెలివేసి వేధిస్తున్నారని.. తమకు అండగా ఉండాలని కోరుతూ సీఎం జగన్‌కు లేఖ  రాసింది. తమ కుటుంబాన్ని వెలివేశారని, బడిలో కూడా తనతో ఎవరూ మాట్లాడటం లేదని పుష్ప లేఖలో పేర్కొంది.



ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామచంద్రపురంనకు చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు కోడూరి వెంకటేశ్వర్లుకు, గ్రామ పెద్దలకు ఊరిలోని ఓ భూమి విషయమై వివాదం మొదలైంది. దీంతో మాజీ ఎంపీటీసీ సభ్యుడికి, గ్రామ పెద్దలకు మధ్య  నెలకొన్న వివాదం కొద్దిరోజులుగా  కోనసాగుతోంది. ఈ నేపథ్యంలో జూలై 13న పెద్దలు, గ్రామస్థులు సమావేశమై ఆ భూమిని, గ్రామాన్ని వదిలి వెళ్లాలని వెంకటేశ్వర్లుకు హుకుం జారీ చేశారు. దీంతో అతను గ్రామం విడిచి వెళ్లిపోయాడు. అనంతరం తనకు ప్రాణహాని ఉందని వేటపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో జూలై 17న పెద్దలు, గ్రామస్ధులు మాజీ ఎంపీటీసీ  వెంకటేశ్వర్లు ఇంటికి తాళం వేశారు. అంతేకాకుండా ఆ  కుటుంబాన్ని బహిష్కరించారు. వారితో ఎవరు మాట్లాడిన రూ.10వేలు జరిమానా చెల్లించాలని తీర్పు చెప్పారు. చివరికి పాఠశాలలో చదువుకుంటున్న వారి పిల్లలతో కూడా ఎవ్వరూ మాట్లాడకూడదని తీర్మానించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనితో మనస్సులో నిత్యం రేగుతున్న అలజడిని ఎవరికి చెప్పుకోవాలో, ఎక్కడ చెప్పుకోవాలో తెలియక కుమిలిపోతోంది. చివరకు ధైర్యం చేసి తన మనస్సులో పెల్లుబుకుతున్న ఆవేదనను అక్షర రూపంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి పంపింది. 


అనంతరం వెంకటేశ్వర్లు జూలై 22న కుటుంబ సభ్యులతో కలిసి ఒంగోలు వెళ్లారు. అక్కడ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు పురుగు మందు తాగేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం అధికారులు సంఘటనపై విచారణ చేపట్టారు. పోలీసుల రక్షణలో వెంకటేశ్వర్లు, చిన్న కుమారుడు, కుటుంబ సభ్యులను గ్రామానికి తీసుకువచ్చారు. అధికారులు పెద్దలతో మాట్లాడారు. ముందస్తు జాగ్రత్తగా పోలీసులు రామ చంద్రాపురంలో పికెట్‌ ఏర్పాటు చేశారు. ఇద్దరు ఏఎస్సైలు, ఒక హెడ్‌కానిస్టేబుల్‌, ఒక హోంగార్డు, ఏడుగురు ఏపీఎస్‌పీ సిబ్బంది మొత్తం 11 మందిని వెంకటేశ్వర్లు కుటుంబానికి కాపలాగా ఉంచారు. ఇప్పటికీ పికెట్‌ కొనసాగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆ విద్యార్థినీ రాసిన లేఖ పట్ల  సీఎం  జగన్ తీవ్రంగా స్పందించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: